తుఫాన్ ఎఫెక్ట్ : మే 2న ఏపీలో కుండపోత వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : April 30, 2019 / 10:14 AM IST
తుఫాన్ ఎఫెక్ట్ : మే 2న ఏపీలో కుండపోత వర్షాలు

అమరావతి: ఈ ఏడాది ఏపీ మరో తుపానును ఎదుర్కోబోతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే2,3  రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.  ఫోని తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది విశాకపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 670 కిలోమీచర్ల దూరంలో ఉంది. ఫోని తుపాను బుధవారం నెల్లూరు జిల్లా కావలిని తాకి, తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుంది.  

దీని ప్రభావం వలన రాగల 24 గంటల్లో  ఏపీలోని దక్షిణ కోస్తాలో వర్షాలు  కురిసే అవకాశం ఉంది. మే 1న ఏపీలో  కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి . ఆ సమయంలో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో  బలమైన ఈదురు గాలులు వీస్తాయి. మే2 నాటికి తుపాను ఉత్తరాంధ్రను తాకవచ్చు. ఈసమయంలో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, జిల్లాల్లోనూ, తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో కోస్తాంధ్రలోనూ ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను ప్రభావం వలన తీరం వెంబడి  గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. 

మే 3 నాటికి  తుపాను ప్రభావం తగ్గినా ఉత్తరాంధ్రలో  అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడి సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది. తుపాను సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు నివారణ సంస్ధ, విశాఖపట్నం, చెన్నైలలోని నేవీ అధికారులు చర్యల కోసం సిధ్దంగా ఉన్నారు.