IMD issued Red Alert : రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్-వానలతో భారీ ముప్పు

రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన వారంరోజులుగా కురిసిన వానకు జనం తడిసి ముద్దయ్యారు. ఇదే పరిస్ధితి దేశమంతా ఉంది.

IMD  issued Red Alert : రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్-వానలతో భారీ ముప్పు

Imd Issued Red Alert For Himachal Pradesh And Uttarakhand Due To Heavy Rains

IMD issued Red Alert : రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన వారంరోజులుగా కురిసిన వానకు జనం తడిసి ముద్దయ్యారు. ఇదే పరిస్ధితి దేశమంతా ఉంది. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వరద నీటితో నిండుకుండని తలపిస్తున్నాయి. వానలకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ వానలు కొన్ని రాష్ట్రాల్లో ఆనందం నింపగా మరికొన్ని రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తున్నాయి. మహారాష్ట్రలో కురిసిన వానలు భయానకంగా తయారయ్యాయి. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో వానలు భారీగా కురుస్తున్నాయి. వీటి నేపధ్యంలో రెండు రాష్ట్రాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో కొండకోన వాగువంకలు నీటితో కళకళలాడుతున్నాయి. వరద పోటెత్తుతోంది. హిమనీనదాలకు భారీగా వరద వస్తుండడంతో పర్వత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఈ వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు మరణించగా…మరో నలుగురు వరదనీటిలో గల్లంతయ్యారు. తుపాను ప్రభావంతో మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో విపత్తు నిర్వహణ దళం అప్రమత్తమైంది. ప్రత్యేకంగా 28 దళాలను సిద్ధం చేసినట్లు ఉత్తరాఖండ్ దళం చీఫ్‌ నవ్‌నీత్‌ సింగ్‌ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది. సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. షిమ్లా జలమయమైంది. ఆ రాష్ట్రంలోని కంగ్డా, బిలాస్‌పూర్‌, మండీ, సిర్‌మౌర్‌ జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సహాయక బృందాలు సిధ్ధంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌, అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలను కూడా భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వానలు పడుతున్నాయి. జాతీయ భద్రతా దళాలతో పాటు ఆయా రాష్ట్రాల బృందాలు కలిసి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.