Weather Report : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాలకు తోడు... అల్ప పీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయ. ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి మరింత బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

10TV Telugu News

Weather Report : నైరుతి రుతుపవనాలకు తోడు… అల్ప పీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయ. ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి మరింత బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది దక్షిణ జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుందని… దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్ స్థాయి వరకు వ్యాపించి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అల్పపీడనం నైరుతి దిశగా పయనిస్తూ… క్రమంగా తెలంగాణ వైపు వస్తున్నట్లు అంచనా వేశారు.

దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని… కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయని… గాలిలో తేమ సాధారణం కన్నా 27 నుంచి 29 శాతం అధికంగా ఉందని అధికారులు తెలిపారు.

సోమవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదయ్యింది. కోనరావుపేట, చందుర్తిలో 12, పెద్దూరులో 11.5, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, వేములవాడలో 10, భీంగల్‌(నిజామాబాద్‌)లో 11, ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌లో 10, బజార్‌హత్నూర్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో..
అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి, ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. ఇది పడమర దిశగా ప్రయాణించవచ్చని అధికారుల తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

 

 

10TV Telugu News