ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు 

  • Published By: chvmurthy ,Published On : May 5, 2019 / 12:20 PM IST
ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు 

అమరావతి: ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఏపీలోని ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 10 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో అత్యధికంగా 46.99 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో 46.62 డిగ్రీల ఉష్ణోగ్రత, కృష్ణా జిల్లా జి.కొండూరులో 46.54 డిగ్రీలు, విజయవాడలో 46.26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. 

 కాగా మరో వైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్‌  కూడా (ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏపీలోని ఐదు జిల్లాల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతున్నట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.  ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో అత్యధికంగా పోలవరంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 52 చోట్ల 45 డిగ్రీల కంటే ఎక్కువ, 127 చోట్ల 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. ఎండలపై తీవ్రతపై కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం  కలెక్టర్లను ఆదేశించారు.  రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ ,తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని, పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.36 డిగ్రీలు, దొనకొండలో 45.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 43.97 డిగ్రీలు, నెల్లూరు జిల్లా బ్రహ్మదేవంలో 44.9 డిగ్రీలు, గుంటూరు జిల్లా బాపట్లలో 43.33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎండ బాగా ఉన్న సమయంలో బయటతిరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించింది. అవసరమైతే గొడుగు వేసుకుని బయటకు రావాలని కోరింది.  గాలిలో  తేమ శాతం తగ్గటం వలన ప్రజలకు వడదెబ్బ త్వరగా కొట్టే అవకాశం ఉంది కనుకు తగిన  జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది.