బంగాళాదుంప పొట్టు తీస్తాం. దోసకాయ చెక్కు తీస్తాం. అరటి పండు, యాపిల్, నారింజ.. ఎన్నో పండ్లు పొట్టు తీసిపారేస్తుంటాం.. తొక్కలోనే ఉన్నాయి  విటమిన్లు, ఖనిజాలు. మరి అవేంటో తెలుసుకుందామా..

పుచ్చకాయ గుజ్జులోకంటే తొక్కలో సిట్రులిన్‌ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోంచి నైట్రోజన్‌ తొలగిపోవటానికి తోడ్పడుతుంది. కండరాల నొప్పులు తగ్గటానికీ దోహదం చేస్తుంది.

యాపిల్‌ తొక్కలో విటమిన్‌ K 332%, విటమిన్‌ A 142%, C 115%, క్యాల్షియం 20%, పొటాషియం 19% ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటు క్వెర్‌సెటిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌.. కూడా ఉంటుంది. ఇది మెదడు, ఊపిరితిత్తులు మరింత బాగా పనిచేయటానికి తోడ్పడుతుంది..

ముదురు ఆకుపచ్చలో ఉండే కీర దోస  తొక్కలోనే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి.  ఎముకలు బలంగా ఉండటానికి, రక్తం గడ్డలు ఏర్పడకుండా చూడటానికి తోడ్పడే విటమిన్‌ K ఎక్కువగా ఉంటుంది.

మామిడి తొక్కతో తినటమే మంచిది. ఇందులో బోలెడంత పీచు ఉంటుంది. విటమిన్‌ E,C యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెరొటినాయిడ్లు ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6.. రెండు రకాల పాలీఅన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలూ ఉంటాయి.

నారింజ తొనల్లో కంటే తొక్కలో విటమిన్‌ C రెండితలు ఎక్కువుంటుంది.విటమిన్‌ బి6, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్‌ వంటి పోషకాలూ ఎక్కువగా ఉంటాయి.

అరటి గుజ్జులోకంటే తొక్కలోనే పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  తొక్కలో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ప్రొటీన్లు, కండరాలు, ఎంజైమ్‌లు, నాడీ సమాచార వాహకాల ఉత్పత్తి, నియత్రణకు తోడ్పడుతుంది.

కివీ పండును తొక్కతో సహా తినటానికి సందేహించాల్సిన పనిలేదు. నూగును గీకేసి పొట్టుతోనే తినేయొచ్చు. దీంతో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి ఎక్కువగా లభించేలా చూసుకోవచ్చు.

గమనిక : తొక్కతో సహా తినాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. తొక్కలపై ఉండే కెమికల్స్...తొలగిపోయేలా శుభ్రం చేసి తినాలనే విషయం అస్సలు మర్చిపోవద్దు..బీ కేర్ ఫుల్.