మామూలుగా అయితే కార్లు, బైకులు, బస్సుల్లాంటి మోటారు వాహనాల వల్ల మనం ట్రాఫిక్‌ జామ్‌ చూస్తుంటాం. అయితే కొన్ని దేశాల్లో సైకిళ్ల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ జరుగుతుంది. ఇంటింటికీ కనీసం ఒక సైకిల్‌ ఉండే దేశాలూ ఉన్నాయి. అంతెందుకూ ఎంత పెద్ద అధికారులైనా సైకిళ్లలో ఆఫీసులకు పోతారు కొన్ని దేశాల్లో. ఇంతకీ ఆ సైకిళ్ల దేశాల గురించి మనమూ తెలుసుకుందామా!

బెల్జియం ప్రజలు సైకిళ్లను విపరీతంగా ప్రేమిస్తారు. అక్కడి జనాభాలో 48 శాతం సైకిళ్లను వాడతారు. ఏకంగా సైకిళ్లతో జాతీయ ఆటే ఉందక్కడ. ఖరీదైన సైకిళ్లను వాడతారు.

స్విట్జర్లాండ్‌లో అయితే 48.8 శాతం మంది సైకిళ్లను వాడతారు. బైక్‌ టు వర్క్‌ అనే క్యాంపెయిన్‌ నడుస్తుందక్కడ. అంటే ఆఫీసులకు సైకిళ్లమీద వెళ్తారు. విహారాలకూ సైకిళ్లమీద వెళ్తారు. మంచుమీద సైకిళ్లపోటీలు జరుగుతాయి.

జపాన్‌లో 56.9 శాతం సైకిళ్లను వాడతారు. ఇక్కడ సంవత్సరానికి పది మిలియన్ల సైకిళ్లు అమ్ముడవుతాయి. మెట్రోల్లో, ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా సరదాగా ఉంటుందనీ, దీంతో పాటు ఆరోగ్యం కోసం సైకిళ్లను ఎంచుకుంటారు.

ఫిన్లాండ్‌లో అయితే 60.4 శాతం సైకిళ్లను తొక్కుతారు. ఇక్కడ సైకిల్‌ ఉండటం సోషల్‌ స్టేటస్‭గా భావిస్తారు. పిల్లలు, మహిళలు సైక్లింగ్‌ను అమితంగా ఇష్టపడతారు.

నార్వేలో 60 వేల సైకిళ్లు చోరీ అవుతుంటాయి. ప్రొఫెషనల్‌ దొంగలు సైకిళ్లకు లాక్‌ వేసినా దొంగతనం చేసి వాటిని రష్యా, ఉత్తర యూరప్‌ దేశాల వారికి తక్కువ ధరలో అమ్మేస్తారు. నార్వే ప్రజలు 60.7 శాతం మంది సైకిళ్లతో సావాసం చేస్తారు.

స్వీడన్‌లో 63.7 శాతం మంది సైకిళ్ల యజమానులు. వీళ్లు ఇంట్లో టీవీ కంటే సైకిల్‌ను ఇష్టపడతారు.

జర్మనీలో 75.8 శాతం మంది సైకిళ్లను ఉపయోగిస్తారు. వీరి ముత్తాతలు కూడా సైకిళ్లపై స్వారీ చేస్తుంటారు.

వాతావరణ కాలుష్యం తగ్గించడానికి డెన్మార్క్‌ ప్రజలు సైకిళ్లను ఆశ్రయిస్తారు. ఈ దేశంలో 80.1 శాతం మంది సైకిళ్లలో బయటకి వెళ్తారు.

ప్రపంచంలోనే అత్యధిక సైకిళ్ల దేశం నెదర్లాండ్స్‌. ‘సైకిల్‌ కంట్రీ’ అని ఈ దేశాన్ని పిలుస్తారు.