ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి.

త్రిపుర

20 ఏళ్లు పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) మరోసారి అధికారంలోకి రావడం అనుమానమే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకుంటే చాలని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఈశాన్యంలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా త్రిపుర స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగితే భంగపాటు ఎదురైంది. ఎటొచ్చీ అధికారంలో ఉన్న బీజేపీయే మళ్లీ గెలుస్తుందనే అంచనాలు చాలా కాలంగానే కొనసాగుతున్నాయి.

నాగాలాండ్

గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన నాగా పీపుల్ ఫ్రంట్ పార్టీ.. తన ఎమ్మెల్యేలను అధికార ఎన్డీపీపీకీ కోల్పోయింది. 22 మంది ఎమ్మెల్యేలు గట్టు దాటడంతో ఆ పార్టీకి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది. ఇక ఈ రాష్ట్రంలో బీజేపీ 12 స్థానాలతో ఉంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇంతకు రెండింతలు స్థానాల్ని గెలుచుకుంటే, అధికారం కమల పార్టీదేనని అంటున్నారు. ఇక స్థానిక పార్టీలు కూడా బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ కూడా తప్పదనే విశ్లేషనలు కూడా వస్తున్నాయి.

మేఘాలయ

మేఘాలయలో నాగా నేషనల్ ఫ్రంట్ కూటమి అధికారంలో ఉంది. నాగా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో మొదటి నుంచి జాతీయ పార్టీ ప్రభావం చాలా తక్కువ. చిన్ని రాష్ట్రమే అయినప్పటికీ స్థానిక పార్టీలు ఎక్కువ. వాటి ప్రభావం కూడా ఎక్కువే. అయితే ఈ రాష్ట్రంలో టీఎంసీ విపక్షంలో ఉంది. అధికార పక్షంతో బీజేపీ దోస్తీ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక పార్టీలే గెలవొచ్చనే అంచనాలు వస్తున్నాయి.