ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ తన సొంత వారి చేతుల్లోనే బలవుతోందని ఐక్య రాజ్యసమితి పేర్కొంది. నవంబర్ 25న మహిళలపై హింస నిర్మూలన దినం సందర్భంగా ఐరాసా చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా మహమ్మారి మొదలు ఆర్థిక సంక్షోభం వరకు వారిపై భౌతికంగా, మౌఖిక దాడులు మరింత పెరుగుతున్నాయట. మహిళలపై ఆన్‌లైన్ హింస కూడా ప్రబలంగానే ఉందట.
లైంగిక వేధింపులతోపాటు మహిళల వస్త్రధారణ, ఫొటోల వంటి విషయాల్లో ఎన్నో రకాలుగా దాడులు కొనసాగుతున్నాయని ఐరాస తెలిపింది.
ఈ వివక్ష, హింస, దుర్వినియోగం మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోన్నట్లు ఐరాస అభిప్రాయ పడింది. మహిళల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను హరిస్తున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది ప్రపంచానికి అవసరమైన సమాన అవకాశాలను, ఆర్థిక పునరుద్ధరణను అడ్డుకుంటోందని, మహిళలపై జరుగుతోన్న హింసను ఇక చరిత్ర పుస్తకాల్లోకి పంపాలని ఐరాస పిలుపునిచ్చింది.
2026 నాటికి మహిళా హక్కుల కోసం పోరాడే సంస్థలకు నిధులు 50 శాతం పెంచాలని ప్రపంచ దేశాలను ఐరాస కోరింది.