‘రథ సప్తమి’ అంటే  ‘సూర్య జయంతి’  అని పురాణాలు చెబుతున్నాయి

‘రథ సప్తమి’ పండుగ మాఘ మాసం శుక్లపక్షం సప్తమి తిథి ‘రథ సప్తమి’వస్తుంది..

పంటల పండుగ సంక్రాంతి తరవాత అవతరించే రథం పండుగ  ‘రథ సప్తమి’..

సూర్యరథం ‘రథ సప్తమి’ రోజు నుంచి దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు..

సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు,  పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు.

రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది.అంటే వేసవి వేడి తెలుస్తుంది..

‘రథ సప్తమి’కి ముంగిట్లో రథం ముగ్గులు వేసి ఆ ముగ్గుల నడుమ ఆవుపేడతో చేసిన గొబ్బీల పిడకలు వేసి, సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు.

పిడకలకు నిప్పు పెట్టి మంట రాజేసి దానిపైన పాలు పొంగించడాన్ని ‘సిరుల పొంగు’కు సంకేతంగా భావిస్తారు.

రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర ఊరేగింపులు ఉత్సాహంగా నిర్వహిస్తారు.

తిరుమల క్షేత్రంలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు అలంకరించి- శ్రీదేవి, భూదేవి సమేతంగా సప్త వాహనాలపైన ఊరేగిస్తారు.

తిరుమాడ వీధుల్లో స్వామి సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమ, చక్రాసన, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాల్ని అధిరోహించి నయనానందంగా విహరిస్తారు. ఏడుకొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు.