రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో ఇప్పుడు ప్రపంచ చూపు మొత్తం యుక్రెయిన్‌ వైపే ఉంది.

యుక్రెయిన్‌‌కి సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. యుక్రెయిన్‌‌లో ఉన్న లొకేషన్స్, మంచు కురిసే ప్రదేశాలు, ఖాళీ మైదానాలు, సముద్ర తీరాలు, అక్కడ షూటింగ్ కి అయ్యే తక్కువ ఖర్చుని ఆధారంగా చేసుకొని చాలా మంది అక్కడ షూటింగ్స్ నిర్వహించడానికి ఇష్టపడుతున్నారు.

చాలా హాలీవుడ్ సినిమాలు యుక్రెయిన్‌ లో షూటింగ్స్ జరుపుకున్నాయి.

యుక్రెయిన్‌‌లో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విన్నర్’. ఈ సినిమాలోని కొన్ని పాటలని యుక్రెయిన్‌‌లో షూట్ చేశారు.

రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో 2.0’ కూడా యుక్రెయిన్‌‌లో షూటింగ్ జరుపుకుంది.

కార్తీ హీరోగా నటించిన ‘దేవ్’ సినిమాలో చాలా సన్నివేశాలని, పాటలని యుక్రెయిన్‌‌లో చిత్రీకరించారు.

ఇటీవల వచ్చిన తమిళ ’99 సాంగ్స్’ సినిమా చాలా భాగం వరకు యుక్రెయిన్‌‌లోనే చిత్రీకరించారు.

దేశం మొత్తం ఎదురు చూసే సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కూడా యుక్రెయిన్‌‌లో షూటింగ్ జరుపుకుంది. 'ఆర్ఆర్ఆర్' చివరి షెడ్యూల్ యుక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంది.

ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగితే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు యుక్రెయిన్‌లో షూటింగ్స్ జరుపుకోవడానికి సిద్దమవుతాయి.