గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది.

మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది.

మరో 93 స్థానాలకు డిసెంబర్ 5న రెండవ దశ పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 8న విడుదల కానున్నాయి.

గుజరాత్‭ను బీజేపీ 27 ఏళ్లుగా నిరాటకంగా పాలిస్తోంది. ఈసారి సైతం విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

27 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. ఇప్పటికీ అధికారం సాధించడం కోసం పోరాటం చేస్తోంది.

కొన్ని సందర్భాల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అధికారం మాత్రం సాధించలేకపోయింది.

దశాబ్దాలుగా ఇరు పార్టీల మధ్య యుద్ధంగా ఉండే గుజరాత్ ఎన్నికలు.. ఆప్ ఎంట్రీతో ఈసారి త్రిముఖ పోరుగా మారింది.

ఆప్ ఎంట్రీ.. కాంగ్రెస్ పార్టీకి బాగానే నష్టం చేయనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ భారీగా చీల్చనుందని వారి అభిప్రాయం.

ఈ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని ఇప్పటికే విడుదలైన ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం 4.9 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉండగా.. ఇందులో కొత్త ఓటర్లు 11.6 లక్షలు.

70 పార్టీలు సహా స్వతంత్రులతో కలిపి మొత్తం 1,621 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.