మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఈనాటిది కాదు. అప్పుడెప్పుడో 1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ నాటి నుంచి కొనసాగుతూనే ఉంది.

కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు తమవేనని మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు తమవేనని కర్ణాటక ప్రభుత్వం.. ఇలా చాలా కాలంగా వాద ప్రతివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

గతంలో ఒకసారి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న జాత్ తహసీలుకు చెందిన కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయి. ఈ విషయాన్ని తాజాగా కర్ణాటక సీఎం బొమ్మై ప్రస్తావించడంతో మహా రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి.

దీనికి మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ జాట్ తీర్మానం 2012లో జరిగిందని, అయితే ఏ గ్రామమూ ఇప్పుడు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు సిద్ధంగా లేదని సమాధానం చెప్పారు.

ఇంతటితో ఆగితే బాగానే ఉంటుంది. కానీ ఫడ్నవీస్ మరో అడుగు ముందుకు వేసి కర్ణాటకలోని బెల్గాం, కార్వార్, నిపాని వంటి మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోని తీసుకొచ్చేందుకు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోందని అన్నారు.

అంతే, ఫడ్నవీస్ వ్యాఖ్యలపై బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యపై ఫడ్నవీస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవని, తమ భూమిని, నీటిని, సరిహద్దులను రక్షించుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని అన్నారు.

బొమ్మై కూడా మరో అడుగు ముందుకు వేసి.. మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే షోలాపూర్, అక్కల్ కోట్ ప్రాంతాలను కర్ణాటకలో కలపాలని, అందుకోసం న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.

ఇరు రాష్ట్రాల సరిహద్దు తగాగాపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మహాజన కమిషన్ అనే కమిటీ వేసింది. అయితే 1960లో ఆ కమిటీ ఇచ్చిన నివేదికను మహా ప్రభుత్వం తోసి పుచ్చింది.

కొన్ని దశాబ్దాల ప్రతిష్టంబన అనంతరం 2004లో సుప్రీంకోర్టును మహా ప్రభుత్వం ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులోనే ఉంది.