ఈరోజుల్లో చాలా మంది పరిచయం కాగానే ప్రేమనే ఫీలింగ్ చెప్పుకోగానే డేటింగ్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. దీనిలో సాన్నిహిత్యంతో పాటు ఒకరినొకరు అర్థంచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్థితిలో కాస్త తేడాగా ప్రవర్తించినా కూడా ఇద్దరి మధ్యా అగాధం వచ్చి పడుతుంది. మీలోని కొన్ని అలవాట్లను గురించి కూడా మీ భాగస్వామికి దాపరికంలేకుండా చెప్పేయడమే నయం. వాళ్లతో కాస్త ఆచి తూచి ఉండటమూ మంచిదే.. అది ఏ విషయాల్లో అంటే..

మీ భాగస్వామి ఎంత ప్రోగ్రెసివ్ అయినా సరే మీ మాజీ గురించి, గతం గురించి పదే పదే మీ వాళ్ళతో మాట్లాడకండి. వాళ్ళ గురించి అన్ని వేళల్లోనూ పంచుకోవడం వల్ల అసహనం కలిగించవచ్చు. కాబట్టి ఆ మాటలు వద్దు.

కొత్తగా పరిచయం అయిన వారితో సక్యంగా మాట్లాడటం, వాళ్ళు చెప్పేది ఓపికగా వినడం, తిరిగి సమాధానం చెప్పడం రెండూ మీ మధ్య స్నేహాన్ని పెంచుతాయి.

ఇద్దరి మధ్య మంచి సంబంధం కొనసాగాలంటే మాత్రం ఒకరిమీద ఒకరికి నమ్మకమనే పునాది తప్పక కావాలి. అయితే వ్యక్తిత్వానికి సంబంధించి లోపాలను ఎంచడం, తప్పులు ఎంచడం వల్ల సంబంధంలో చీలికలు వస్తాయి.

మీ నిర్ణయం ఎలా ఉన్నా ముక్కుసూటిగా ఉండటం మంచిది. లేదంటే సమస్యను పెంచిన వారు అవుతారు. లేదా సమస్యలో తప్పుడు నిర్ణయం తీసుకుని బాధపడవలసి వస్తుంది.

నచ్చకపోయినా నచ్చిందని, మీకు సమ్మతమేననే విషయాన్ని చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఫేక్‌గా మారకండి. మీరు నటిస్తే అది మీ భాగస్వామికి తెలిసిపోతుంది.

భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దానితో గొడవ పెట్టుకోవడం, ఇబ్బంది పెట్టడం లేదా ఫిర్యాదు చేయడం వల్ల పరిస్థితి మరీ విషమంగా తయారవుతుంది.

రిలేషన్‌లో ఉండవచ్చు కానీ, అది మీ భాగస్వామి వ్యక్తిగత స్పేస్‌లోకి చొరబడే హక్కును మీకు ఇవ్వదు. డేటింగ్‌లో ఉన్నంత మాత్రాన హద్దులను దాటకుండా ఉండటమే బంధాన్ని నిలపడంలో సహకరిస్తుంది.