చిక్కుడు గింజల ఆకారంలో ఉండే కిడ్నీలు మన శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన అవయవాలు.
రక్తంలోకి చేరిన జీవక్రియల వ్యర్థాలను వడకట్టి బయటకు పంపించడంతోపాటు.. రక్తపోటు నియంత్రణకు సాయపడుతాయి.
ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, శరీరంలో లవణాలు సమతుల్యంగా ఉండేందుకు కిడ్నీలు కీలకంగా వ్యవహరిస్తాయి..
ముఖ్యంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి మనం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి..
అటువంటి కిడ్నీలకు అనారోగ్య సమస్య రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.. రక్తపోటు నియంత్రణలో పెట్టుకోకపోతే అది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలి..
నీరు : రోజుకు కనీసం రెండు,మూడు లీటర్లు తాగాలి. నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న సోడియం, వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు బయటకు పంపించగలవు. అప్పుడు కిడ్నీలపై చెడు ప్రభావం పడదు.
నీరు తగినంత తీసుకోకపోతే అధిక సోడియం, వ్యర్థాలు శరీరంలో ఉండిపోయి కిడ్నీలకు హాని చేస్తాయి.
పొగతాగడం : పొగతాగడం అన్నది రక్త నాళాల పూడికకు లేదా దెబ్బతినడానికి కారణమవుతుంది. కిడ్నీల్లో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. పొగతాగడం వల్ల రీనల్ సెల్ కార్సినోమా (కిడ్నీ కేన్సర్)కు దారితీసే ప్రమాదం ఉంది.
పరీక్షలు తప్పనిసరి : మధుమేహులు, తక్కువ బరువుతో పుట్టిన వారు, గుండె జబ్బులున్న వారు, అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.