నమ్మిన సిద్ధాంతం కోసం రాజకీయాలు చేసే నాయకులు అతి కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో ఒకరు జేడీయూ మాజీ అధినేత శరద్ యాదవ్. చివరి శ్వాస వరకు సోషలిస్ట్ నాయకుడిగా జీవించిన శరద్ యాదవ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

లోహియా ఆలోచనలతో ఇంజనీరింగ్ వదిలి రాజకీయ ఆరంగేట్రం చేసిన శరద్ యాదవ్.. తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఓబీసీల సామాజిక న్యాయం కోసమే ఖర్చు చేసిన నిఖార్సైన రాజకీయ వేత్త.

అనేక టోపీలు మార్చారనే బలమైన విమర్శ ఉన్నప్పటికీ, అదంతా తను నమ్మిన సిద్ధాంతాల కోసమేనని ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.

రాజకీయ ప్రయోజనాల కోసం పోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి శరద్ యాదవ్ అనేది తరుచుగా వినిపించే మాట. రాజీవ్ గాంధీ నుంచి లాలూ వరకు చాలా మంది నేతలపై పోటీకి దిగారు.

దేశ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసిన మండల్ కమిషన్‭ను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం అమలులో శరద్ యాదవ్ కీలక పాత్ర పోషించారు.

మహిళా రిజర్వేషన్ల అమలుకు యూపీఏ-2 ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తెచ్చారు. ఓబీసీల సామాజిక-ఆర్థిక పరిస్థితుల మీద కులగణన చేయాలని తరుచూ డిమాండ్ చేస్తుండే వారు.

రాజకీయ పార్టీలను కన్విన్స్ చేయడంలో కూడా దిట్ట. కాంగ్రెస్‭కు వ్యతిరేకంగా జనతా పార్టీతో కూటమి ఏర్పాటులో ఈయనదే కీలక పాత్ర పోషించారు.

అతి ఎక్కువ కాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నాయకుల్లో శరద్ యాదవ్‭ ఒకరు. మొత్తం ఏడుసార్లు లోక్‭సభకు ఎన్నికయ్యారు. అయితే మూడుసార్లు తన సభ్యత్వానికి మధ్యలోనే రాజీనామా చేశారు.

సోషలిస్ట్ నేతే అయినప్పటికీ బీజేపీతో ఈయనకు సుదీర్ఘకాలం స్నేహం ఉంది. అటల్ బిహార్ వాజీపేయి ప్రభుత్వంలో ఈయన కేంద్ర విమానయాన మంత్రిగా పని చేశారు. అలాగే ఎన్డీయే కన్వీనర్‭గా కూడా పని చేశారు.

మండల్ కమిషన్ విషయంలో బీజేపీ నేతల్ని సైతం ఈయన కన్విన్స్ చేశారని అంటారు. అయితే మండల్ కమిషన్ అమలు అనంతరం బీజేపీ వ్యతిరేకించింది.

కుటుంబ సభ్యుల్ని ఎవర్నీ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. పదవుల కోసం ఆశపడలేదు. తనను తాను సోషలిస్టుగా ప్రకటించుకుని రాజకీయం ప్రారంభించిన ఆయన చివరి శ్వాస వరకు నిఖార్సైన సోషలిస్ట్ నాయకుడిగా జీవితాన్ని గడిపారు.