చూడటానికి కోతుల్లా ఉండి.. ఎలుకలాంటి ముఖం.. కళ్లద్దాలు పెట్టుకున్నట్లుండే ఈ చిన్ని జంతువులను ‘మీర్‌క్యాట్స్‌’ అని పిలుస్తారు. ఇవి మనుషుల్లానే రెండు కాళ్లతో నిలబడినట్లు ఫోజులు పెడతాయి.

డచ్‌ భాషలో మీర్‌ అంటే సరస్సు. సరస్సుల దగ్గర ఉండే పిల్లులే ‘మీర్‌క్యాట్స్‌. దక్షిణ అమెరికాలో ఉండే ఈ జీవులు ముంగిస కుటుంబానికి చెందినవి.

ఇవి ఎలుకలానే వేగంగా మట్టిని తవ్వుతాయి. మట్టి బొరియల్లో నివసిస్తాయి. విచిత్రంగా మట్టి తోడేప్పుడు దొరికే తేళ్లను ఇవి తింటాయి.

వీటి పిల్లలకు చనిపోయిన తేళ్లు ఇచ్చి ఇలా పట్టుకోవాలని శిక్షణ ఇస్తాయి. ఇవి ముఖ్యంగా పురుగులు, పండ్లు, బల్లులు, సీతాకోకచిలుకలు, గుడ్లు, పాములు, బుల్లిపక్షులను ఆహారంగా తీసుకుంటాయి.

ఇవి సామాజిక జీవులు. నాలుగు నుంచి 30 జీవులు ఎప్పుడూ ఒకే చోటు ఉంటాయి. ఇవన్నీ దాదాపు ‘జత’లుగానే ఉంటాయి. గుంపుగా ఉండటానికి ఇష్టపడతాయి.

వీటి అరుపు కుక్కపిల్లలు అరిచినట్లు ఉంటుంది. ఇవి పాములపై దాడి చేస్తాయి. ఆ దృశ్యాన్ని చూస్తే ఇవి ఎంత చురుగ్గా ఉంటాయో అర్థమవుతుంది.

మనుషులు, డాల్ఫిన్స్‌లానే ఈ జీవులు తెలివైనవని పరిశోధనల్లో తేలింది. వాతావరణ పరిస్థితులను అక్కడి చెట్లు లేదా కొండలు ఎక్కి గమనించగలవు. దానికి తగినట్లు స్థలమార్పిడి చేయగలవు.

ఇవి ఎడారుల్లోనూ జీవించగలవు. పన్నెండేళ్ల పాటు బతుకుతాయి. నీళ్లు తాగకున్నా బతకటానికి కారణం జ్యూసీ ఫుడ్‌ను తినటం వల్లే.