హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్‭‭ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డ్రైవర్ కుమారుడిగా ఒకప్పుడు పాలు అమ్మిన ఆయన నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు రాజకీయ ప్రస్థానం ఆద్యంతం సవాళ్లమయం. అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎం కుర్చీ వరకు వచ్చారు. కాగా, ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

వీరభద్ర సింగ్ లేకుండా మొదటి సారి ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి.. ఇది తొలి విజయం. పైగా ఎన్నికల బాధ్యతల్ని పూర్తిగా భుజాల మీద వేసుకుని నడిపించిన సుఖు.. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆర్టీసీ డ్రైవర్ కుమారుడు అయిన సుఖుది నిరాడంబరమైన జీవితం. తన చిన్నతనంలోనే ఛోటా సిమ్లాలో మిల్క్ కౌంటర్‌ను నడిపేవారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎక్కడా ఆగకుండా అంచెలంచెలుగా ఎదిగారు.

కాంగ్రెస్ అనుబంధ ఎన్‭ఎస్‭యూఐ రాష్ట్ర విభాగానికి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పని చేశారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. రెండుసార్లు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

ఆరుసార్లు ముఖ్యమంత్రి అయిన వీరభద్ర సింగ్‌తో తరచుగా విభేదాలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో వీరభద్ర సింగ్‭కు చాలా ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆయనతో విభేదిస్తూనే 2013 నుంచి 2019 వరకు రికార్డు స్థాయిలో ఆరేళ్లపాటు పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా కొనసాగారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత పాత పోటీ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి వీరభద్ర సింగ్ కాకుండా ఆయన భార్య ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.

1966లో హిమాచల్‌లో విలీనమైన నలాఘర్, ఉనా, హమీర్‌పూర్, కాంగ్రా, దిగువ కొండలు కులు వంటి ప్రాంతాలతో కూడిన ప్రాంతం నుంచి వచ్చిన మొదటి కాంగ్రెస్ నాయకుడు సుఖు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత హమీర్‌పూర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి.

రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‭గా ఉన్న సుఖు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా శనవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైనప్పుడే హైకమాండ్ విశ్వాసం ఆయనకు మెండుగా ఉందని స్పష్టమైంది. ఆయన మద్దతుదారులకు పెద్ద సంఖ్యలో పార్టీ టిక్కెట్లు లభించాయని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.