6 నెలలుగా కనిపించని ఆ ముగ్గురు వైసీపీ ఎంపీలు, వెతుకులాటలో జిల్లా వాసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం. ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 40 లక్షల మంది ఓటర్లున్నారు. మూడు జిల్లాల శాసనసభ నియోజకవర్గాలను కలుపుతూ ముగ్గురు పార్లమెంట్ సభ్యులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి. కానీ ఆరు నెలలుగా ఈ ముగ్గురు ఎంపీలు నియోజకవర్గాల నుంచి మాయం అయిపోయారట.

మా ఎంపీలను కాస్త వెతికి పెట్టండి:
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన రోజు నుంచి ఈ ముగ్గురు ఎంపీలు తమ తమ నియోజకవర్గాలను మర్చిపోయారని జనాలు అంటున్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పాటు కృష్ణా జిల్లాలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పశ్చిమకు సంబందించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాజమహేంద్రవరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం ఈ మూడు ఎంపీ నియోజకవర్గాల ప్రజలు తాము ఎన్నుకున్న ఎంపీలు ఎక్కడ ఉన్నారో కాస్త వెదికిపెట్టండని కోరుతున్నారట.

ఏలూరు ఎంపీ ఎలా ఉంటాడో కూడా తెలియదంట:
ఏలూరు నుంచి మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ తొలి పోటీలోనే ఎంపీగా గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తొలి రోజుల్లో అప్పుడప్పుడు ఏలూరులోని తన కార్యాలయంలో కనిపించేవారు. తర్వాత రోజురోజుకు నియోజకవర్గ ప్రజలకు దూరమవుతూ వచ్చారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఓటర్లకు, నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ఎంపీ శ్రీధర్ కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గం వైపు చూడలేదు. ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లయితే వేశారు కానీ… తమ ఎంపీ ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఉందంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన ఎంపీ కనిపించడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు.

హైదరాబాద్, ఢిల్లీకే పరిమితం అయిన రఘురామ:
ఇక, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి ప్రస్తుతం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారు. లాక్‌డౌన్ తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్, ఢిల్లీలోనే మకాం పెట్టారు. కోవిడ్ విజృంభణతో హైదరాబాద్ నుంచి నరసాపురం నియోజకవర్గంలోకి రాని రఘురామకృష్ణంరాజు వైసీపీ విధానాలపై, ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వార్తల్లో మాత్రం కనిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడో ఉన్న ఢిల్లీకి పదేపదే వెళ్లడానికి ఆయనకు సమయం దొరుకుతుందని గానీ నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పే తీరిక లేకపోవడం విడ్డూరమే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

READ  కూల్ వెదర్ : హైదరాబాద్‌లో వర్షం

భరత్‌కు రాజమహేంద్రవరం మీద మాత్రమే శ్రద్ధ:
ఇక రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌కు పశ్చిమ గోదావరితో నేరుగా సంబంధాలు లేకపోయినా జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు కనీసం ఒకసారైనా రాలేదు. భరత్‌కు రాజమహేంద్రవరం మీద ఉన్న శ్రద్ధ ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై లేనట్లే కనిపిస్తోందని అంటున్నారు. కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు కనీస అవసరాలు ఏమైనా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్న పాపాన పోలేదట. ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకి మాత్రమే ఎంపీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తీరు మారకపోతే కష్టాలు తప్పవని ఎంపీలకు వార్నింగ్:
ఈ ముగ్గురు ఎంపీలు కనపడకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజలు మా ఎంపీలు ఎక్కడ అని వెదుక్కునే పనిలో పడ్డారట. వీళ్ళు చేసే అభివృద్ధి మాట ఆ దేవుడు ఎరుగు అసలు తమ ప్రాంతాలకు ఎంపీలు ఉన్నారా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ఢిల్లీలో హడావుడి చేసే ఈ ఎంపీలు కరోనా తీవ్రంగా మారుతున్న ఈ సమయంలోనైనా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపాలని కోరుతున్నారు. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఫ్యూచర్‌లో తమకు టైమ్‌ వచ్చినప్పుడు ప్రజలు తమదైన స్టయిల్‌లో సమాధానం ఇస్తారని అంటున్నారు.

Related Posts