లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

నాగార్జున సాగర్‌ నియోజకవర్గ సమస్యలేంటి? ఉప ఎన్నికతో పరిష్కారమవుతాయా?

Published

on

What are the problems in Nagarjuna Sagar constituency? : నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి. ప్రధాన పార్టీల తరుపున ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో ఆయా పార్టీల క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికల పేరుతో అయినా నియోజకవర్గంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ఓటర్లు ఎదురుచూస్తున్నారు. అసలు నాగార్జున సాగర్‌ నియోజకవర్గ సమస్యలేంటి?

నాగార్జునసాగర్‌.. నాగార్జునుడు నడయాడిన నేల. పర్యాటక కేంద్రంగా ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలంగా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వరప్రదాయిని. సాగునీటి ప్రాజెక్ట్ గా అందరి మనసుల్లో మెదుల్తోంది. నిత్యం నిశ్శబ్దంగా ఉండే నాగార్జునసాగర్‌లో ఇప్పుడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తోన్నారు.

నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినా.. నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నియోజకవర్గం పేరుకు నాగార్జునసాగర్ అయినా.. ప్రధాన కేంద్రం మాత్రం హాలియానే. 2007 వరకు చలకుర్తి నియోజకవర్గంగా ఉన్న సమయంలోనూ హాలియానే నియోజకవర్గం కేంద్రంగా ఉండేది. కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి పలుమార్లు విజయం సాధించి తన జైత్రయాత్రను కొనసాగించారు. 2009 ఎన్నికల ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చలకుర్తి నియోజకవర్గం.. నాగార్జునసాగర్ గా పేరు మారింది. నియోజకవర్గ పరిధిలో హాలియా, నిడమనూరు, గుర్రంపోడు, పెద్దవూర, త్రిపురారం, తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

నాగార్జున సాగర్‌కు మొదటి నుంచి ఎలాంటి హోదా లేకపోవడంతో అభివృద్ధి అటకెక్కింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ కు మున్సిపాల్టీగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే నందికొండ మున్సిపాల్టీగా మారినా.. సిబ్బంది కొరతతో మున్సిపాలిటీ సమస్యల నిలయంగా మారింది. నియోజకవర్గంలో సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఉంటే.. నాగార్జునసాగర్ లో కేవలం 12 వేల మంది ఓటర్లున్నారు. ఇదే నాగార్జునసాగర్ కు మొదటి నుంచి శాపంగా మారిందనే వాదన ఉంది. పేరు గొప్పగా ఉన్నా.. స్థానికంగా నివాసం ఉండేవారు తక్కువ. డ్యామ్‌ నిర్వహణ ఉద్యోగులే ఉంటున్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఉపాధి. చిన్న చిన్న రైస్ మిల్లులు.. ఓ ఫార్మా పరిశ్రమ తప్ప నియోజకవర్గంలో ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవు. చెప్పుకోవడానికి పేరు తప్ప ఏం చేసి ఇక్కడ బతకాలో అర్థం కావడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ప్రభుత్వ భూములు వేల ఎకరాలు అందుబాటులో ఉన్నా.. అక్కడ పరిశ్రమలు తీసుకురావడంలో అటవీశాఖ అనుమతులు క్లియర్ చేయించడంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన అందరూ విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నాగార్జునసాగర్ పట్టణంలో ఇప్పటికీ స్థానికులకు సొంత గృహం కల నెరవేరలేదు. స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవు. పక్కనే భారీ రిజర్వాయర్ ఉన్నా.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా.. నాగార్జునసాగర్ పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులున్నాయి. టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ లో పలు లిఫ్టులు ముంపునకు గురికాగా.. ఇప్పటికీ వాటిని పునరుద్దరించలేదు. దీర్థకాల డిమాండ్ గా ఉన్న నెల్లికల్ లిఫ్ట్ ను మంజూరు చేస్తూ ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హలియాలో ఎన్నో సంవత్సరాలుగా డిగ్రీ కాలేజీ కోసం ఉద్యమాలు జరిగాయి. తాజాగా డిగ్రీ కాలేజీకి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలా ఎన్నో సమస్యలు నాగార్జునసాగర్ వాసులకు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వారి సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటున్నా.. పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ సారి ఎన్నికల్లోనైనా పార్టీలు తమగోడు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.