China, Silk Road, One Target, China Project, Africa, USA, Jin ping

వన్ సిల్క్ రోడ్.. వన్ టార్గెట్… అసలేంటీ చైనా ప్రాజెక్టు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అసలేంటీ చైనా ప్రాజెక్టు? చైనా నుంచి ఆసియా దేశాల మీదుగా ఆఫ్రికా , ఐరోపా వరకూ రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు నిర్మించడమంటే మాటలా ? ఇంత భారీ ప్రాజెక్టును చైనా ఎందుకు చేపట్టింది ? ఈ ప్రాజెక్టులో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి? ఇందు కోసం లక్షల కోట్ల డాలర్లు చైనా ఎక్కడి నుంచి తెస్తుంది ? అమెరికా ఈ ప్రాజెక్టును తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తోంది ? సిల్క్ రోడ్.. ఒకప్పుడు చైనాను ప్రపంచంతో కలిపిన వాణిజ్య మార్గం. రెండు వేల సంవత్సరాల క్రితం చైనా నుంచి యూరేషియా మీదుగా మధ్యధరా సముద్రం వరకూ రోడ్డు మార్గం ఉండేది. ఆనాడు చైనాను పాలించిన హాన్ వంశ రాజుల కాలంలో దీన్ని నిర్మించారు. ప్రధాన వర్తక , వాణిజ్య కార్యకలాపాలకు అది కేంద్రం అయ్యింది. ఒంటెలూ, గుర్రాలపై సరుకులు రవాణా జరిగేది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సరుకు రవాణాతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉండేది. చైనాలో తయారయ్యే పట్టు వస్త్రాలు ఐరోపా వరకు ఈ మార్గం గుండానే ఎక్కువగా రవాణా చేసే వారు.

అందుకే దీనికి సిల్క్ రోడ్ అని పేరొచ్చింది. కొన్ని శతాబ్దాల పాటు అది నడిచింది. అదంతా గతం . ఇప్పుడు అదే మార్గాన్ని తిరిగి ప్రారంభించాలని చైనా అధ్యక్షుడు జింపింగ్ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేశారు . చైనా నుంచి ఆసియా దేశాల మీదుగా ఆఫ్రికా , ఐరోపా దేశాలను కలుపుతూ రైలు , రోడ్డు నిర్మాణాలు చేపట్టడం ఇందులో భాగం . అటు సముద్ర మార్గం ద్వారా కూడా చైనాను ఆఫ్రికా , ఐరోపాలకు కలపడం కూడా ఇందులో భాగమే . మొదట్లో దీన్ని వన్ బెల్ట్ , వన్ రోడ్ ప్రాజెక్టుగా పిలిచారు . తరువాత బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ అని పేరు మార్చారు . మొత్తం డెబ్భై దేశాలకు ఈ ప్రాజెక్టు విస్తరించింది . ప్రపంచం లోని 60 శాతం మంది ప్రజలకు చేరువ కావాలన్నది దీని లక్ష్యం. ఆ ప్రాంతాల్లో చైనా వస్తువులను అమ్ముకోవడం ద్వారా ఆర్థిక శక్తిగా ఎదగొచ్చన్నది జిన్పింగ్ ప్రధాన వ్యూహం.

ఇందులో రెండు ప్రధాన భాగాలున్నాయి . దక్షిణ ఆసియా , ఆగ్నేయ ఆసియా , మధ్య ఆసియా , రష్యా , ఐరోపాలను రైలు , రోడ్డు మార్గాల ద్వారా చైనాకు లింక్ చేయడం ఒకట. రెండోది… చైనా తీర ప్రాంతాలను ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, దక్షిణ పసిఫిక్, పశ్చిమ ఆసియా, తూర్పు ఆఫ్రికా, ఐరోపా దేశాలకు సముద్ర మార్గం ద్వారా కలపడం . ఇందులో అయిదు భాగాలున్నాయి . విధాన పరమైన సమన్వయం . మౌలిక సదుపాయాల ఏర్పాటు. నిరంతరంగా సాగే వర్తకం. భాగస్వామ్య దేశాల ఆర్థికాభివృద్ధి. ప్రజల మధ్య సంబంధాలు. ప్రారంభంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని చైనా సంకల్పించింది.

చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులు ఇందుకు అవసరమైన నిధులు అందిస్తాయి. ప్రాజెక్టులో భాగంగా రోడ్లు, రైల్వే మార్గాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థ , విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తారు. ఏటేటా ఈ ప్రాజెక్టు విస్తరిస్తూ పోతోంది. పైగా వీటి రక్షణ కోసం ఈ రోడ్డు వెళ్లే కీలక ప్రాంతాల్లో సైన్యాన్ని కూడా మోహరించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా సక్సెస్ అయితే.. ప్రపంచంలోని కీలక ప్రాంతాల్లో చైనా సైన్యం మోహరించినట్లే. చైనా ప్రస్తుత వ్యవహారం చూస్తుంటే.. ఒకప్పుడు ఈస్ట్ఇండియా కంపెనీ వ్యాపారం కోసం వచ్చి రాజ్యాలను ఆక్రమించినట్లుగానే కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్టును ప్రారంభం నుంచి అమెరికా వ్యతిరేకిస్తోంది . ఈ ప్రాజెక్టు మొత్తం చైనా ఇచ్చే రుణాలపై ఆధారపడింది. పేద దేశాలు అప్పుల ఊబిలో కూరుకు పోతాయని అమెరికా ఆరోపించింది. అభివృద్ధి పేరుతో చైనా పేద దేశాలను తన గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తుందని కూడా అమెరికా విమర్శిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకున్న దేశాలు తమ సార్వభౌమాధికారం కోల్పోయే ప్రమాదం ఉందన్నది మరో విమర్శ. అందుకే అమెరికా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

కానీ, పైకి చెప్పని భయాలు అమెరికాకు కొన్ని ఉన్నాయి. అయితే గియితే బెల్ట్ రోడ్డు ఇనీషియేటివ్ ప్రాజెక్టు విజయవంతమ్ అయ్యిందే అనుకుందాం . ప్రపంచ వర్తకం పై చైనా పట్టు మరింత బిగుస్తుంది . ఆర్ధికంగా చైనా మరింత బలపడుతుంది . డాలరు స్థానం లో చైనా యువాన్ అంతర్జాతీయ మారక ద్రవ్యం అవుతుంది . ఆర్ధికంగా బలపడ్డ చైనా సైనికంగా కూడా ఎదుగుతుంది . అమెరికా సైన్యానికి సవాలుగా మారుతుంది . చివరకు అమెరికా అగ్ర రాజ్యం కిరీటం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

Related Posts