త్వరలో ‘కొవిడ్’ వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. తొలి దశ ఫలితాలు సూపర్!

When Covid-19 Vaccine to be invented from Oxford University

కరోనా వైరస్‌కు టీకా కొనుగొనే విషయంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌ పరీక్షల్లో ముందడుగు పడింది. ప్రయోగశాలల్లో ఫలితాలు అద్భుతంగా ఉన్నట్టు వర్శిటీ తెలిపింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ ప్రయోగాలు రెండో దశకు చేరుకున్నాయి. ఈ దశ విజయవంతంగా పూర్తయ్యితే... మూడో దశను కూడా మొదలు పెట్టనుంది. మూడు దశలు విజయవంతగా పూర్తయితే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. రెండో దశలో భాగంగా విస్తృత ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టినట్టు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయం వెల్లడించింది. 

తొలి దశలో వెయ్యి మందికి ఇమ్యూనైజేషన్‌ చేసినట్టు ఆక్స్‌ఫర్డ్‌ తెలిపింది. వీటి ఫలితాలను విశ్లేషిస్తున్నట్టు చెప్పింది. ఇక రెండోదశలో 10వేల 260 మందిపై తాము తయారు చేస్తోన్న టీకాను ప్రయోగించనున్నట్టు ప్రకటించింది. టీకాను 56ఏళ్లు పైబడిన వారు, 5 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్నవారిపై ప్రయోగించనున్నట్టు తెలిపింది. ఇది పూర్తయితే మూడో దశకూడా మొదలు పెట్టనున్నట్టు ఆక్స్‌ఫర్డ్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ChAdOx1 nCoV-19 పేరుతో టీకాను అభివృద్ధి చేసింది. దీనిలో వినియోగించిన అడినో వైరస్‌ను చింపాజీల నుంచి సేకరించారు. 
covid virus

వీటిలో జన్యుపరమైన మార్పులు చేసి SARS cov-‌2లో ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ ఏర్పాటు చేశారు. ఈ వైరస్‌ శరీరంలోకి వెళ్లాక నకళ్లను సృష్టించి వ్యాపించదు. దీనిని చూసి శరీరం రోగనిరోధక శక్తిని తయారు చేసుకొనేలా ప్రేరేపిస్తుంది. ఈ టీకాను తీసుకొన్న 6 రీసెస్‌ కోతులు వైరస్‌ను నిలువరించాయి. అమెరికాలోని మాన్టానలోని రాకీమౌంటెన్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రయోగశాలలో దీనిని నిర్వహించినట్లు 'న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. దీంతో ఈ టీకా కరోనాపై మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

కరోనా విరుగుడుకు కనుగొంటున్న టీకా ప్రయోగాల్లో రెండు, మూడో దశలే కీలకమని చెప్పవచ్చు. ఈ ప్రయోగాల్లో పాల్గొనే వారిలో కొందరికే కరోనావైరస్‌ కోసం చేసిన టీకా ఇస్తారు. మిగిలిన వారికి MenACWY అనే టీకా ఇస్తారు. ఎవరికి ఏ టీకా ఇచ్చింది తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. కొవిడ్‌-19కు వ్యతిరేకంగా ఈ టీకా ఎలా పనిచేస్తుందో అంచనావేస్తారు. అదే సమయంలో ప్రమాదకరమైన సైడ్‌ఎఫెక్ట్‌లు లేవని నిరూపించాల్సి కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. ఎవరికైతా టీకా వేస్తారో వారు ఏడు రోజులపాటు తమ లక్షణాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 
covid viruses

కోవిడ్‌ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న కొందరిలో కొవిడ్‌ లక్షణాలు కనబడితే ప్రయోగ ఫలితాలను విశ్లేషించడానికి అవకాశం  ఉంటుంది. సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉంటే వెంటనే ఎక్కువ మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు లక్షణాలు కనిపించిన వారు ఆక్స్‌ఫర్డ్‌ టీకా తీసుకొన్నారా..? లేదా Men ACWY టీకా తీసుకొన్నారా అన్నది విశ్లేషిస్తారు. ఆక్స్‌ఫర్డ్‌ టీకా తీసుకొన్న వారిలో సానుకూల ఫలితాలను బట్టి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. అందుకే ఈ ప్రయోగానికి కొవిడ్‌ బారిన పడే అవకాశం ఉన్న చోట్ల విధులు నిర్వహిస్తున్న వారినే ఎంపిక చేసుకొన్నారు. వీరిలో వైద్య సిబ్బంది, ఇతర కీలక విభాగాల్లో పనిచేసే వారు ఉన్నారు.

మరిన్ని తాజా వార్తలు