రష్యన్ కరోనా వ్యాక్సిన్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచానికి తొలి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని రష్యా వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే మంగళవారం(ఆగస్టు 11,2020) కరోనా టీకా గురించి కీలక ప్రకటన చేసింది. మాస్కోలోని గమలేయ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ను ఆమోదించినట్టు రష్యా ప్రకటించింది. ఈ ప్రకటన యావత్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది. కరోనా రోగుల్లో ఆనందం నింపింది. అదే సమయంలో రష్యా కరోనా వ్యాక్సిన్ పై అనేక విమర్శలు వచ్చాయి. సరైన పద్దతిలో కాకుండా హడావుడిగా టీకాను అభివృద్ధి చేశారని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా సురక్షితం కాదంటున్నాయి. దీనికి కారణం ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ ను కేవలం రెండు నెలల్లో పూర్తి చేశామని రష్యా చేసిన ప్రకటనే. అంత తక్కువ సమయంలో ట్రయల్స్ ను పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా కొవిడ్ టీకా ఎంతవరకు సురక్షితం అనేది చెప్పలేకపోతున్నారు.

కరోనా టీకా భారత్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
కాగా, రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ప్రపంచ దేశాలకు ఆ టీకా ఎప్పుడు లభిస్తుంది? ప్రస్తుతం ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. వ్యాక్సిన్ ఉత్పత్తిని రష్యా వెంటనే స్టార్ట్ చేస్తారని సమాచారం. రష్యాకు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థ సిస్టెమా కరోనా టీకాను ఉత్పత్తి చేయనుందని తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ తొలి బ్యాచ్ రెడీగా ఉందని సిస్టెమా ప్రకటించింది. త్వరలోనే వ్యాక్సిన్ బ్యాచ్ లను రష్యాలోని ప్రావిన్సులకు సరఫరా చేస్తామంది. తొలుత, కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ఏడాదికి 500 మిలియన్ డోసుల టీకా ఉత్పత్తి లక్ష్యం:
కాగా, ఏడాదికి 1.5 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను మాత్రమే ఉత్పత్రి చేసే సామర్థ్యం సిస్టెమా కంపెనీకి ఉంది. ప్రపంచానికి బిలియన్ డోసుల అవసరం ఉన్న ఈ తరుణంలో సిస్టెమా చేసే ఉత్పత్తి సరిపోదు. దీంతో రష్యా ప్రభుత్వం ప్రపంచ దేశాలతో ఒప్పందాలు చేసుకోనుంది. ఏడాదికి 500 మిలియన్ డోసుల టీకాను ఉత్పత్తి చేసేందుకు ప్రపంచ దేశాలతో రష్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ డోసులు తమకు కావాలని ప్రపంచ దేశాల నుంచి రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి.

భారత్ లో వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం పొందాలంటే ఏం చేయాలి?
వ్యాక్సిన్ ఉత్పత్తి సమస్యలను పక్కన పెడితే భారత్ లాంటి దేశాల్లో కరోనా టీకాను అందుబాటులోకి తేవాలంటే రెగులేటరీ అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. భారత్ లో వ్యాక్సిన్ వాడకానికి ఆమోదం పొందాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. భారత రెగులేటరీ వ్యవస్థ ప్రకారం… విదేశాల్లో తయారైన ఏదైనా టీకా లేదా డ్రగ్.. భారత్ లో వాడాలంటే, ముందుగా స్థానికులపై హ్యుమన్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే, వివిధ జనాభా సమూహాల నుండి భిన్నమైన రోగనిరోధక ప్రతిస్పందనలు వస్తాయి. దీని ప్రకారం టీకా తయారు చేసిన రష్యా సంస్థలు లేదా భాగస్వాములు భారత్ కు చెందిన వాలంటీర్లపై ఫేజ్ -2, ఫేజ్-3 హ్యుమన్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించారు.

READ  మాల్యాకు బిగ్ షాక్: అప్పగింతకు బ్రిటన్ అంగీకారం

చివరి దశ హ్యుమన్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి తీసుకోవాలి:
పుణెకి చెందిన సీరమ్, ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ లో ఫేజ్ 2, ఫేజ్ 3 హ్యుమన్ ట్రయల్స్ నిర్వహణకు డ్రగ్ రెగులేటరీ సంస్థ అనుమతి కూడా సీరమ్ పొందింది. ఈ ట్రయల్స్ లో ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్టు తేలితేనే.. ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను భారత ప్రజలు వాడేందుకు అనుమతిస్తారు. అదే రూల్ ను రష్యా కూడా ఫాలో అయితే.. భారత్ లో ఫేజ్ 2, ఫేజ్ 3 హ్యుమన్ ట్రయల్స్ పూర్తి చేయడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ముందుగా ట్రయల్స్ నిర్వహణకు భారత డ్రగ్ రెగులేటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. కానీ రష్యా నుంచి ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తులు అందలేదు.

ట్రయల్స్ లేకుండానే అనుమతి ఇవ్వొచ్చు:
అదొక్కటే కాదు మరో మార్గం కూడా ఉంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో భారత డ్రగ్ రెగులేటర్ నుంచి రష్యా కరోనా వ్యాక్సిన్ అత్యవసర అనుమతి పొందొచ్చు. ఆ విధంగా ఎలాంటి ఫేజ్ ట్రయల్స్ నిర్వహించకుండానే కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో వాడటానికి అనుమతి లభిస్తుంది. ఒకవేళ రష్యాలో నిర్వహించిన హ్యుమన్ ట్రయల్స్ ఫలితాలతో భారత డ్రగ్ రెగులేటరీ సంస్థ సంతృప్తి చెందితే, భారతదేశంలో మానవ పరీక్షల అవసరం లేకుండానే టీకాకు అత్యవసర అనుమతి ఇవ్వగలదు. ఇటీవల కరోనా మందు రెమ్ డెసివిర్ విషయంలో అలానే జరిగింది. కరోనా రోగుల ట్రీట్ మెంట్ లో వాడేందుకు రెమ్ డెసివిర్ ఔషధానికి అత్యవసర ఆమోదం లభించింది.

రిస్క్ తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందా?
అయితే రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ విషయంలో అలా జరగకపోవచ్చు. డ్రగ్ వేరు టీకా వేరు. డాక్టర్ సూచన మేరకు రోగులకు డ్రగ్ ని ఇవ్వడం జరుగుతుంది. అయితే వ్యాక్సిన్ అలా కాదు, దాన్ని ప్రజలందరికి ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా టీకా ఇవ్వాల్సి ఉంటుంది. చివరి దశ ట్రయల్స్ నిర్వహించకుండానే అంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెమ్ డెసివిర్ అనుమతి లభించిన ఔషధం. కేవలం కరోనా రోగులకు మాత్రమే దాన్ని ఇస్తారు. కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. రెమ్ డెసివిర్ భద్రత విషయంలోనూ ఆందోళన, అనుమానం అవసరం లేదు. కాగా చివరి దశ ట్రయల్స్ నిర్వహించకుండా, రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా ఎంతవరకు సురక్షితం అనేది చెప్పలేము.

READ  2020లో భారత్ వృద్ధిని 0.2శాతానికి తగ్గించిన మూడీస్

రష్యా కన్నా ముందున్న చైనా:
కాగా, రష్యా కన్నా ముందే చైనాకు చెందిన క్యాన్ సినో బయోలాజికల్స్ అభివృద్ధి చేసిన కరోనా టీకాకు జూన్ లోనే ఆమోదం లభించింది. కానీ కేవలం చైనా ఆర్మీకి చెందిన సైనికులకు మాత్రమే ఆ టీకాను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమంది చైనా సైనికులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారనే సమాచారం లేదు. రష్యా కరోనా వ్యాక్సిన్ తరహాలోనే చైనా కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకాను ఫేజ్ -3 హ్యుమన్ ట్రయల్స్ నిర్వహించకుండానే ఆమోదించడం జరిగింది. సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహణకు రెడీ అవుతున్నామని క్యాన్ సినో బయోలాజికల్స్ కంపెనీ ఇటీవలే ప్రకటించింది.

Related Posts