మంత్రిగా ఉన్నప్పుడు అన్నీ తానై చక్రం తిప్పిన నారాయణ.. ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో గత కొంత కాలంగా ఆయన యాక్టివ్‌గా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ వార్తల్లో నిలిచిన ఆయన.. అధికారం కోల్పోయాక మాత్రం ఎక్కడా ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు. పొలిటికల్ కామెంట్సూ వినిపించడం లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ తానై చక్రం తిప్పిన నారాయణ 2014, 2019 ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక ఇంధనంగా కూడా పనిచేశారు. అలాంటి కీలక నేత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారు? అని నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు రాష్ట్ర నేతల్లోనూ చర్చ జరుగుతోంది.

జగన్ సీఎం అయ్యాక అడ్రస్ లేని నారాయణ:
వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి నారాయణ అడ్రస్ లేకుండాపోయారు. ప్రజా వేదిక కూల్చివేత టైంలో కనిపించ లేదు. రాజధాని రచ్చ విషయంలోనూ బయటకు రాలేదు. కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతున్న సమయంలోనూ ఎక్కడున్నారో తెలియడం లేదు. అంతర్వేది ఘటనతో ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి. అంతర్వేది ఘటనపై త్వరలో సీబీఐ విచారణ జరగనుంది. ఇన్ని ప్రధానమైన ఇష్యూలు రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ నారాయణ మాత్రం ఎక్కడా స్పందించడం లేదు. కనీసం వాటిపై ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చేయకుండా మిన్నకుండిపోతున్నారు.

రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఎందుకున్నారు?
గత కొన్ని నెలలుగా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలకు నారాయణ దూరంగా ఎందుకున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళనలు, నిరసనలలో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఎవరికీ అందుబాటులోకి లేకుండాపోయాడు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన నారాయణ రెండు వేల ఓట్ల తేడాతో మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానై వ్యవహరించిన నారాయణ ఫలితాలు వచ్చిన తర్వాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు.

వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినా ఓటమి:
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నేతలను నారాయణ పూర్తిగా దూరం పెట్టారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి తనతో ఉన్న తన సన్నిహితులు, బంధువులను తప్ప ఎవరినీ దగ్గరకు రానీయలేదట. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినా ఓటమి పాలవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారట. తాను నమ్మిన నాయకులు పక్కనే ఉంటూ తన కింద గోతులు తీశారనే అనుమానం నారాయణలో బలంగా నాటుకుపోయిందంటున్నారు. నమ్మిన వాళ్లే నట్టేట ముంచడంతో నారాయణ ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారని టాక్‌.

వైసీపీలోకి, బీజేపీలోకి వెళ్తారని ప్రచారం:
కరోనాకు ముందు చంద్రబాబు నెల్లూరుకి వచ్చినప్పుడు రెండు రోజుల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొన్న నారాయణ.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. అమరావతిలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. ఇటీవల ఆయన వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జోరుగా సాగింది. చంద్రబాబు కోటరీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ వంటి కీలక నేతలు బీజేపీలో చేరడంతో నారాయణ కూడా కమలం వైపు మొగ్గు చూపుతున్నారుని ప్రచారమూ సాగింది. కానీ అవన్నీ ప్రచారంగానే మిగిలిపోయాయి.

మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా?
నారాయణ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా తమ విద్యా సంస్థల బాధ్యత దగ్గరగా ఉండి చూసుకుంటున్నారని చెబుతున్నారు. విద్యా సంస్థల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారట. మరి మాజీ మంత్రి నారాయణ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా? లేక దూరమైపోతారా అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుందని అంటున్నారు.Related Posts