అక్కడంతే..ఆడవాళ్ల పేర్లు చెప్పకూడదు: పెళ్లి..బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ లో కూడా పేరు కనిపించకూడదు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆఫ్ఘనిస్తాన్. ఆడవారిపై ఆంక్షలకు..అణచివేతలకు మారుపేరు. ఆడవారి ఉనికి వినిపించకూడదు. వారి పేరు ఎక్కడా వినిపించకూడదు..కనిపించకూడదు. అదీ అక్కడి చాలా ప్రాంతాల్లోని ఆడపుట్టుకల దుస్థితి. మహిళలు వంట ఇంటి సంకెళ్లను తెంచుకుని ఆకాశంలో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు.కానీ కొన్ని దేశాల్లో మాత్రం అర్థం పర్థం లేని కట్టుబాట్లు..ఆంక్షలతో ఆడవాళ్ల తీవ్రమైన అణచివేతకు బలైవుతునే ఉన్నారు. వారిలో ఉండే ప్రతిభను కాలరాసేస్తోంది పురుషాధిక్యత సమాజం.

ఆ అణచివేత ఎంతగా అంటే…ఆడవారి పేరు కూడా బైటకు చెప్పకూడదు..అమ్మాయికి వివాహం చేస్తే ఆ వివాహ ఆహ్వాన పత్రికలో కూడా వరుడి పేరు ఉంటుంది గానీ వధువు పేరు ఉండదు. అంతేకాదు..మహిళలు చనిపోతే..డెత్ సర్టిఫికెట్స్ లో కూడా వారి పేరు కనిపించదు.వారు చనిపోతే వారి సమాధులపై కూడా వారి పేరు రాయరు. మరి ఆడవారికి పేర్లు పెట్టటం ఎందుకు? అనే ప్రశ్న ఆదేశంలో చాలామంది ఆడవాళ్లు వచ్చే ప్రశ్న.కానీ ప్రశ్నించే సాహసం మాత్రం చేయరు..ప్రశ్నించేవారిని వేధించటం మాత్రం మానదు అక్కడి సమాజం. సమాజం అంటే ఆడా మగా కలిసిందే సమాజం. కానీ అక్కడ చాలామంది ఆడవాళ్లు ఇది అంతే..అదే సంప్రదాయం అని సరిపెట్టేసుకుని బతికేస్తుంటారు.

వివాహం అయి ఆ అమ్మాయి అత్తారింటికి వెళితే..అక్కడ అక్క..వదిన..అమ్మ అనే వరుసలే వినిపిస్తాయి తప్ప కట్టుకున్న భర్త కూడా భార్య పేరుతో పిలవడు. ఆఖరికి జబ్బుపడ్డ ఆడవాళ్లు డాక్టర్ దగ్గరకెళితే వారి పేరు చెప్పకూడదు..!! అలా చెబితే ఏం జరుగుతుందో ఓ మహిళ తన భర్త చేతిలో తిన్న చావు దెబ్బలే సమాధానం చెబుతాయి.ప‌శ్చిమ అఫ్గానిస్తాన్‌కు చెందిన రెబియా అనే మహిళ చలి జ్వ‌రంతో బాధ‌ప‌డుతుంటే ఆమెను భర్త డాక్ట‌ర్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. నీ పేరేమిటమ్మా అని అడిగాడు డాక్టర్ ఆమె రెబియా అని చెప్పింది. అతను మందుల చీటీపై ఆమె పేరు రాశాడు. చలి జ్వరంతో బాధపడే రెబియాకు టెస్ట్ లు చేసిన డాక్టర్ కొన్ని రోజులకు కోవిడ్‌-19 సోకిన‌ట్లు డాక్టర్ నిర్ధారించారు.

డాక్టర్ కు పేరు చెప్పినందుకు భార్యను చావబాదిన భర్త
జ్వ‌రం, వొళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతూ ఇంటికి వ‌చ్చిన రెబియా.. డాక్టర్ ఇచ్చిన మందుల చీటీ భర్తకు ఇచ్చి మందులు తీసుకురమ్మని చెప్పింది. మందుల చీటీ మీద రెబియా పేరు చూసిన వెంట‌నే భ‌ర్తకు విప‌రీత‌మైన కోపం వచ్చింది. నీ పేరు ఎందుకు చెప్పావంటూ జ్వరంతో బాధపడే ఆమెను చావబాదాడు. అంతలా ఉంటుంది అక్కడి ఆడవారి పరిస్థితి..కాదు కాదు దుస్థితి.

అఫ్గాన్‌లో డాక్ట‌ర్ల‌తో స‌హా బ‌య‌టి వ్య‌క్తులు ఎవ‌రికీ పేరు చెప్ప‌కూడ‌ద‌ని మ‌హిళ‌ల‌కు కుటుంబ స‌భ్యులు ఆదేశిస్తారు. ఈ మాత్రం దానికి ఆడపిల్లలకు చిన్నప్పుడు పేర్లు ఎందుకు పెడుతున్నారు? తమకంటూ ఓ గుర్తింపు లేకుండా..కనీసం పేరు కూడా చెప్పుకునే పరిస్థితి లేని ఇటువంటి బతుకు ఎందుకు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు కూడా.

మూడేళ్లుగా ‘వేరీజ్‌మైనేమ్’ ఉద్యమం
‘వేర్ ఈజ్‌ మై నేమ్‌?’ అనే పేరుతో ఉద్యమం నడిపిస్తోందామె. అసలు ఆడపిల్లలకు పేరు పెట్టాలా? అంత అవసరమా? అనే ప్రశ్న ఆడపిల్ల పుట్ట‌గానే మొద‌ల‌వుతుంది. నిజానికి ఆమెకు ఒక పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డానికే సంవత్సరాలు ప‌డుతుంది.పెళ్లి ఆహ్వాన ప‌త్రిక‌ల్లో వ‌ధువు ఉందడు. డాక్టర్లకు పేరు చెప్పకూడదు. ఆమె చ‌నిపోయాక ప్రభుత్వ జారీచేసే మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రంపైనా ఆమె పేరు క‌నిపించ‌దు.

ఆఖరికి స‌మాధిపై కూడా పేరు ఉండ‌దు.అందుకే అఫ్గానిస్తాన్ మ‌హిళ‌లు వేర్ఈజ్‌మైనేమ్‌? ఉద్యమం న‌డిపిస్తున్నారు. త‌మ పేరును స్వేచ్ఛ‌గా ఉప‌యోగించుకోనివ్వాల‌ని..నినదిస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌లు గోడ‌ల‌పైన‌, సోష‌ల్ మీడియా వేదిక‌ల్లోను క‌నిపిస్తాయి. అటువంటి సమయాల్లో ఉద్యమం చేసేవారిపై దాడులు కూడా జరుగుతాయి.

నా పేరు చెప్పి చెబితే వచ్చే లాభమేంటి? 
హెరాత్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ..మహిళ పేరు చెప్పకూడదనే విషయంలో మగవారికే నా మద్దతు అని తెలిపింది. “ఎవ‌రైనా పేరు చెప్పమని అడిగిన‌ప్పుడు..చెప్పాల్సిన సందర్భంగా వచ్చినప్పుడు నా కన్న తండ్రి, తోడబుట్టిన సోద‌రులు, నా భర్తల గౌర‌వం గుర్తుకు వ‌స్తుంది. దాన్ని పోగొట్టటం నాకు ఇష్టం లేదు..అందుకే నా పేరు చెప్ప‌ను”అని చెప్పింది. అంతేకాదు..నేను నా పేరు చెప్పి..నా కుటుంబానికి త‌ల‌వంపులు తీసుకురావాలా? ఇప్పుడు నా పేరు చెబితే వ‌చ్చే లాభ‌మేంటి? చెప్పకపోతే వచ్చే నష్టమేంటీ? నేను మా నాన్న కూతురిగా, నా సోద‌రుడి చెల్లిగా, నా భ‌ర్త‌కు భార్య‌గా, పిల్ల‌ల‌కు త‌ల్లిగా.. న‌న్ను పిల‌వాల‌ని కోరుకుంటాను..అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే మహిళలపై ఆ పద్ధతి ఎంతగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
అమ్మాయి పేరు పైకి చెబితే.. అగౌరవం
ఇవన్నీ వింటే ఇవి కేవలం కట్టుకథలు అనుకుంటారు. కానీ అక్షర సత్యాలు.కానీ అఫ్గాన్‌లో అమ్మాయి పేరు పైకి చెబితే.. క‌నుబొమ్మ‌లు పైకిలేపి చూస్తారు. పేరు చెబితే అగౌరవంగా చూస్తారు. చాలామంది అఫ్గాన్‌వాసులు త‌మ అక్క చెల్లెళ్లు, భార్య‌లు, త‌ల్లుల పేర్లు బ‌హిరంగంగా చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఇక్క‌డి మ‌హిళ‌ల‌ను అమ్మ, అక్క, చెల్లి అని బంధుత్వం పేరుతోనే పిలుస్తారు. వారి పేరుతో కాదు.

ఆడపిల్ల పుడితే బర్త్ సర్టిఫికెట్ లో తండ్రి పేరు మాత్రమే
ఆడపిల్ల పుడితే బర్త్ సర్టిఫికెట్ లో కేవ‌లం తండ్రి పేరు మాత్ర‌మే రాయాల‌ని అఫ్గాన్ చ‌ట్టాలు చెబుతున్నాయి. ఇలా ఇటువంటి ఘటనల గురించి చెప్పుకుంటే ఆడపుట్టుకలపై ఆఫ్ఘనిస్థాన్ లో ఎన్నో ఆంక్షలు..మరెన్నో అణచివేతలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి..కానీ కట్టుకున్న భార్యను..కన్నబిడ్డలను గురించి ఏమాత్రం పటట్టించుకోని భర్త పేరును చెప్పాలంటే కూడా ఇష్టపడని ఓ భార్య ఆవేదన గురించి కూడా తెలుసుకోవాలి.
వదిలేసిన భర్త పేరుతోనే పిల్లలకు గుర్తింపు..తల్లి పేరుండాలని పోరాడుతున్న మహిళ
ఫరీదా సాదాత్ అనే ఆఫ్ఘనిస్థాన్ మహిళ జర్మనీకి వలస వెళ్లారు. ఆమెను భర్త్ వదిలేశాడు. విడాకులు ఇవ్వడు. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. తన పిల్లల గుర్తింపు కార్డుల్లో తనను వదిలేసిన భర్త పేరు ఉంది గానీ ఆమె పేరు మాత్రం లేదు. దీంతో ఆమె మమ్మల్ని పట్టించుకోని నా భర్త పేరు గుర్తింపు కార్డుల్లో ఉండకూడదని ఆమె పోరాడుతోంది.
ఫ‌రీదా సదాత్‌కు బాల్యంలోనే వివాహ‌మైంది. 15 ఏళ్ల‌ు వచ్చేసరికి ఓ బిడ్డ కూడా పుట్టాడు.అలా న‌లుగురు పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత‌..భ‌ర్త వదిలేశాడు. దీంతో ఆమె పిల్ల‌ల‌తో కలిసి జ‌ర్మ‌నీ వెళ్లిపోయింది. కానీ తన పేరుతో కాదు భర్త పేరే పిల్లకు జర్మనీలో గుర్తింపు కార్డుల్లో ఉంది. దీంతో ఆమె నా పిల్లల గురించి పట్టించుకోని ఆయన పేరు వారి గుర్తింపు కార్డుల్లో ఆయ‌న పేరు ఉండాల్సిన అవ‌స‌రం ఏముంది? అని ప్రశ్నిస్తోంది. తన భర్త పేరును తీసి వేసి తన పేరు పెట్టించుకోవటానికి పోరాడుతోంది.

ఇటువంటి చట్టాలు మార్చాలని వేడుకుంటున్న ఫరీదా సదాత్
అఫ్గాన్‌లో చాలామంది నా భర్తలాంటివారున్నారు. వారికి ఒక్కొక్క‌రికి ఇద్ద‌రు-ముగ్గురు భార్య‌లుంటారు. తమకు పుట్టిన పిల్ల‌ల్ని ప‌ట్టించుకోరు గానీ వరసగా పెళ్లిళ్లు మాత్రం చేసుకుంటారని వాపోయింది. ఇటువంటి దారుణమైన చట్టాలు మార్చాలని అఫ్గాన్ అధ్య‌క్షుణ్ని నేను వేడుకొంటున్నా. పిల్ల‌ల గుర్తింపు కార్డులు, జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌పై తల్లి పేరు ఉండేలా చూడాల‌ని అభ్య‌ర్థిస్తున్నానని ఆమె తెలిపింది.

Related Posts