hyd mayor

కాబోయే మహిళా మేయర్ ఎవరు ? TRS లో మొదలైన లాబీయింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Who is the future woman mayor? : హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా గెలిస్తే ఎంత క్రేజ్ ఉంటుందో.. మేయర్ అయితే.. ఆ ఇమేజ్ మరోలా ఉంటుంది. అందుకే.. గ్రేటర్ మేయర్ పీఠంకోసం.. హైదరాబాద్, రంగారెడ్డి టీఆర్ఎస్ నేతలు లాబీయింగ్ మొదలుపెట్టేశారు. తమ కుటుంబసభ్యులను మేయర్ సీటులో కూర్చోబెట్టేందుకు.. పావులు కదుపుతున్నారు. ఈ లిస్టులో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. హైదరాబాద్ లాంటి సిటీకి మేయర్ అయితే.. ఆ ఇమేజే వేరు. ఆ స్పెషాలిటీనే వేరు. అందుకే.. ఆ పదవిని దక్కించుకునేందుకు చాలా మంది కలలు కంటారు. ఇన్నేళ్లలో.. కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే.. భాగ్యనగరం మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఆ ఇద్దరూ కాంగ్రెస్‌కు చెందినవాళ్లే. ఇప్పుడు.. మూడోసారి మహిళా అభ్యర్థికి మేయర్‌ పీఠాన్ని అధిరోహించే అవకాశం వచ్చింది. 2020 గ్రేటర్ ఎన్నికల్లో.. మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో.. పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది.



ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానంలో కూర్చుకునే అదృష్టం.. ఏ మహిళా నేతను వరిస్తుందోనన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. సిట్టింగ్ కార్పొరేటర్లు, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న మహిళలు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ మేయర్ సీటు కోసం అధికార టీఆర్ఎస్‌లో చాలా పోటీ నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా ఓ రేంజ్‌లో లాబీయింగ్ చేస్తున్నారు. తమ కుటుంబసభ్యులకే.. మేయర్ పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ బొంతు రాంమోహన్, ఎమ్మెల్యేలు భేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎంపీ కేకే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డితో పాటు కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా మేయర్ పీఠంపైనే ఆశలు పెట్టుకున్నారు.



మేయర్ పదవి రేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ కోడలు మహిత, ప్రస్తుత మేయర్ బొంతు రాంమోహన్ సతీమణి శ్రీదేవి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కోడలు ఉన్నారు. వీళ్లంతా.. తమ వాళ్లను మేయర్‌గా కూర్చోబెట్టేందుకు ఎన్నికల బరిలో దించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోడళ్లు, మంత్రి మల్లారెడ్డి కూతురు కూడా బల్దియా బరిలో దిగే చాన్స్ ఉందంటున్నారు.



అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సతీమణి కాలేరు పద్మ, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్నారెడ్డి, కార్పొరేటర్‌గా ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు, కార్పొరేటర్ సునరిత కూడా మేయర్ పదవిని ఆశిస్తున్నారు. మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఎంపీ కె.కేశవరావు కూతురు, కార్పొరేటర్ విజయలక్ష్మి కూడా.. మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.



వీరితో పాటు.. ఐఎస్ సదన్ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్ రెడ్డి, బాలాజీనగర్ కార్పొరేటర్ పూజిత, మాదాపూర్ కార్పొరేటర్ పూజిత గౌడ్ కూడా మేయర్ పదవిని ఆశించే వాళ్ల లిస్టులో ఉన్నారు. వీళ్లు.. జీహెచ్ఎంసీ పాలకమండలి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. సిటీకి చెందిన మరో నేత దానం నాగేందర్ కూతురు కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయితే తప్ప.. చివరిగా మేయర్ బరిలో ఎవరుంటారన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related Tags :

Related Posts :