లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

కౌన్ బనేగా బల్దియా కింగ్.. మేయర్ పీఠం ఎవరిదో?

Published

on

GHMC elections results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలొచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మరి మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? లీడింగ్‌లో ఉన్న టీఆర్ఎస్సా? రెండో స్థానంలో నిలిచిన బీజేపీనా? లేక ఎంఐఎమ్మా? ముగ్గురిలో ఎవరి అభ్యర్థి మేయర్ కాబోతున్నారు? ఒకవేళ గ్రేటర్ పీఠంపై జెండా ఎగురవేయాలి అంటే.. మూడు పార్టీలకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? కౌన్ బనేగా బల్దియా కింగ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఎగ్జిట్ పోల్స్ సహా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓటర్లు తీర్పు చెప్పారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 149 ఫలితాలను ఎస్‌ఈసీ అధికారికంగా ప్రకటించింది. నేరేడ్‌మెట్‌లో పోలైన ఓట్లలో స్వస్తిక్ గుర్తులు వివాదాస్పదం కావడంతో ఫలితాన్ని హోల్డ్‌లో ఉంచింది. సోమవారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేరేడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్‌ లీడింగ్‌లో ఉంది. దానితో కలుపుకుంటే.. టీఆర్ఎస్ 56డివిజన్లలో గెలుపొందుతోంది. బీజేపీ, 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2చోట్ల విజయం సాధించాయి.

మేయర్ పీఠాన్ని కైవసానికి రెండు పద్దతుల్లో బల నిరూపణ చేసుకోవచ్చు. ఒకటి నేరుగా తమకున్న సంఖ్యా బలాన్ని చూపించడం. ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకోవడం రెండవది. డైరెక్ట్‌ పద్ధతిలో మేయర్‌గా గెలవాలి అంటే.. 150మందిలో సగానికి పైగా.. మద్దతు కావాలి. ప్రస్తుతం టీఆర్ఎస్‌ 56 డివిజన్లు మాత్రమే గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ 76కు చేరుకోవాలి అంటే మరో 20మంది సభ్యుల బలం కావాలి.ఒకవేళ రెండో పద్ధతి ప్రకారమైతే.. జీహెచ్ఎంసీ పరిధిలో 48 ఎక్స్ అఫిషియోఓట్లు ఉన్నాయి. 150 డివినజ్లకు వాటిని కలిపితే మొత్తం పాలక మండలి సభ్యులు 198మంది అవుతారు. అంటే మేజిక్‌ ఫిగర్‌ 100కు చేరుతుంది. బల్దియాలో టీఆర్‌ఎస్‌కు 34మంది ఎక్స్అఫిషియో సభ్యుల బలం ఉంది. మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవాలంటే.. 66సీట్లు కావాల్సి ఉంది. టీఆర్ఎస్‌ 56డివిజన్లు మాత్రమే గెలుచుకోవడంతో.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే.. మరో 10మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది.

రెండు పద్ధతుల్లోనూ టీఆర్ఎస్‌కు కావాల్సినంత సంఖ్యా బలం లేదు. కచ్చితంగా ఎంఐఎం లేదా బీజేపీ మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంఐఎంకు టీఆర్ఎస్‌కు మధ్య మంచి అవగాహన ఉంది. ఎంఐఎం మా మిత్రపక్షమని సీఎం కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు తీసుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం అంత ఆసక్తిగా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎంఐఎం మద్దతు లేకుండా మేయర్ పీఠాన్ని ఏరకంగా దక్కించుకోవాలనే ఆలోచనలో గులాబీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. 2010లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతిచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను 2016వరకు రెండు పార్టీలు పంచుకున్నాయి. ప్రస్తుతం ఒకవేళ గ్రేటర్ పీఠాన్ని పంచుకోవాల్సి వస్తే మేయర్ టీఆర్ఎస్ తీసుకున్నా.. డిప్యూటీ మేయర్‌ను ఎంఐఎంకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎంఐఎం మద్దతు తీసుకోవాలా వద్దా అన్న మీమాంశలో టీఆర్ఎస్ పడింది.

ఎంఐఎం మద్దతు లేకుండా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రోజు కోరంలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉండాలి. ఒకవేళ 150మంది హాజరైతే.. 76 మంది మద్దతును టీఆర్ఎస్ చూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంఐఎం సభ్యులు గైర్హైజరైతే.. 106మంది సభ్యుల కోరం మాత్రమే ఉంటుంది.అందులో సగం అంటే 54మంది సభ్యుల బలం కావాలి. టీఆర్ఎస్‌కు 56 మంది సభ్యుల బలం ఉంది కాబటి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను ఈజీగా కైవసం చేసుకుంటుంది. అలా కాకుండా ఎంఐఎం కోరంకు హాజరైతే.. మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో తమ అభ్యర్థులను నిలపాల్సి ఉంటుంది. 56మంది మద్దతు టీఆర్ఎస్‌కు ఉంటుంది. ఎంఐఎంకు 44మంది మద్దతు మాత్రమే ఉంటుంది.ఆటోమెటిక్‌గా ఎక్కువ మంది సభ్యుల బలమున్న టీఆర్ఎస్ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్‌ గా ఎన్నికవుతారు. ఈ వ్యూహాన్ని గులాబీ దళం అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 10వరకు ప్రస్తుత పాలకమండలికి గడువుంది. ఆ తర్వాతే కొత్త పాలక వర్గం ఏర్పాటు కానుంది. మరో రెండు నెలల సమయం ఉండడంతో.. ఏమైనా జరిగే అవకాశం ఉంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *