Who Will Get Udayagiri TDP MLA Ticket in Nellore District

ఉదయగిరిలో నాలుగు స్తంభాలాట : టీడీపీలో కమ్మ వర్సెస్ రెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నెల్లూరు: జిల్లాలోని ఆ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఈసారి ఎన్నికల్లో ఓవైపు రెడ్డి సామాజికవర్గం మరోవైపు కమ్మ సామాజికవర్గం. రెండింటి మధ్య నువ్వా నేనా అంటూ రసవత్తర

నెల్లూరు: జిల్లాలోని ఆ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఈసారి ఎన్నికల్లో ఓవైపు రెడ్డి సామాజికవర్గం మరోవైపు కమ్మ సామాజికవర్గం. రెండింటి మధ్య నువ్వా నేనా అంటూ రసవత్తర పోరు సాగుతోంది. మరి టీడీపీ టిక్కెట్‌ కోసం పోటీపడుతున్న ఆ నాయకులు ఎవరు..? ఏ సామాజికవర్గం నాయకుడు బరిలోదిగే ఛాన్స్‌ ఉంది..? అసలు ఆ నియోజకవర్గం ఏది..? నెల్లూరు జిల్లా టీడీపీలో ఆసక్తి రేపుతున్న నాలుగు స్తంభాలాటపై స్పెషల్ స్టోరీ..

 

దేశ, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించిన ఎందరో నాయకులను అందించిన నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల టికెట్ల  కోసం ఆశావహులు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం నలుగురు నాయకులు పోటీ పడుతుండడంతో.. అక్కడ రాజకీయాలు  రసవత్తరంగా మారాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, వ్యాపారవేత్త కావ్య కృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, సీఎం ప్రొటోకాల్ ఆఫీసర్ అశోక్ బాబు టీడీపీ టికెట్  కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

 

విస్తీర్ణం పరంగా పెద్దదైన ఈ నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలుంటే.. 2లక్షల 13వేల మంది ఓటర్లున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఇది విలక్షణమైంది. పార్టీల కంటే వ్యక్తులను, వారి నాయకత్వ గుణాలనే ప్రజలు అభిమానిస్తారు. 1978లో ఇందిరాగాంధీ ప్రభంజనంలోనూ 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని  గెలిపించారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీ ఓటర్లున్నా.. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలదే డామినేషన్.

 

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత బొల్లినేని రామారావు విజయం సాధించారు. అయితే ప్రజా సంక్షేమం కన్నా బొల్లినేనికి కాంట్రాక్టర్లే ముఖ్యమని,  ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. పసుపు కుంభకోణం, మహారాష్ట్రలో ఏసీబీ కేసులు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో అధికారులపై దురుసు ప్రవర్తన వంటి అంశాలు  బొల్లినేని ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నాయి. అటు స్థానికంగా జరిగిన చెక్‌ డ్యామ్‌ల పనుల్లో తమ వద్దే కమీషన్‌లు తీసుకున్నారంటూ అనుచరులు కూడా బొల్లినేనిపై ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం  సాగుతోంది. మరోవైపు చంద్రబాబు జరిపిన ఐవిఆర్‌ఎస్ సర్వేలో కూడా ఫలితాలు బొల్లినేనికి వ్యతిరేకంగా వచ్చినట్లు సమాచారం.

READ  స్వామి మీరే రక్షించాలి : చిన జియ్యర్ ను వేడుకొన్న వీఆర్వోలు

 

ఇక కావ్య కృష్ణారెడ్డి ఆర్ధికంగా బలమైన నేత. గతంలో జలదంకి ఎంపీపీగా పనిచేసిన కావ్యకు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మానుగంటి మహేందర్ రెడ్డిలతో సన్నిహిత  సంబంధాలున్నాయి. వీరిద్దరూ టీడీపీ నుంచి వైసీపీలోకి మారినా కృష్ణారెడ్డి మాత్రం తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ది పనుల్లో  కృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించారు. ఈయనకు జలదంకి, వింజమూరు, కొండాపురం, కలిగిరి మండలాల్లో మంచి పట్టుంది. నియోజకవర్గంలో ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను తీర్చడం,  స్కూల్‌లో బ్యాగుల పంపిణీ, కొత్త దంపతులకు 10వేల రూపాయల పెళ్లి కానుక, గిరిజన కుటుంబాలకు మంచాలను పంపిణీ చేస్తున్నారు. తనకున్న పరిచయాలతో కావ్య టికెట్ కోసం తీవ్రంగా  కృషి చేస్తున్నారు.   

 

మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కూడా టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్నప్పటికీ ఇటీవలే టీడీపీ ఆయన్ని తెలుగు రైతు అధ్యక్షుడిగా నియమించింది. కొంతకాలంగా ఎమ్మెల్యే బొల్లినేని  తీరు నచ్చక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కంభం.. 2019 ఎన్నికల్లో పోటీలో ఉండకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఆఫీసర్‌గా పని చేస్తున్న అశోక్ బాబు కూడా  టికెట్‌ను ఆశిస్తూ.. సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. తన కమ్మ సామాజికవర్గాన్నే నమ్ముకుని టికెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.

 

అటు.. వైసీపీ కూడా ఉదయగిరిలో బలంగానే ఉంది. 2019 ఎన్నికల్లో కూడా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ క్యాండెట్‌గా బరిలో దిగే ఛాన్స్ ఉంది. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి  చెందిన నాయకుడినే బరిలో నిలపాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితేనే ఆ వర్గం ఓట్లను చీల్చడంతోపాటు గెలిచే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయన్నది టీడీపీ  అధిష్టానం ఆలోచన. ఈ క్రమంలో వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత  ఇస్తే తప్పేంటని స్వయంగా సీఎం చంద్రబాబే అంటున్నారు. ఈ విధంగా చూస్తే .. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేనిని పక్కన పెడతారని స్పష్టంగా చెప్పలేం. దీంతో ప్రస్తుత  పరిస్ధితుల్లో ఉదయగిరి టీడీపీ టికెట్టు కమ్మ సామాజిక వర్గానికి చెందుతుందా.. లేక రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Related Posts