bjp

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అధికార పార్టీకి చెమట్లు పట్టించిన ఆ పార్టీ ఇప్పుడు డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

bjp: నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం.. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతసారి రెండో స్థానంలో సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం డిపాజిట్‌ అయినా దక్కించుకుంటుందా? గత సారి అధికార పార్టీకి కౌంటింగ్‌ రోజున చెమట్లు పట్టించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం పోటీ అయినా ఇస్తుందా? కొంత ఓటింగ్‌ ఉన్నా.. ఫైటింగ్‌ చేయడానికి ఆ పార్టీ ఎందుకు వెనకాడుతోంది?

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బీజేపీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు:
నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం బాధ్యతలు చేపట్టాక దేశవ్యాప్తంగా బీజేపీ దూకుడు పెరిగిందనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపించినా… తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని ఆ పార్టీలోనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కూడా అలాంటి జిల్లాల్లో ఒకటి. వామపక్ష ఉద్యమ నేపథ్యమున్న నల్లగొండ జిల్లాలో బీజేపీకి మొదటి నుంచి పెద్దగా ఆదరణ లేదనే అంటున్నారు.

ఇతర పార్టీలతో సమీకరణాలు కలసిరావడంతో ఒకటి రెండు సార్లు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించినా.. ఆ తర్వాత ఓటింగ్ పరంగా కూడా పెద్దగా సాధించిందేమీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్నీ చోట్లా పోటీ చేసి.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి బడా నేతలు ప్రచారం చేసినా కనీసం డిపాజిట్‌ కూడా రాలేదు.

పోటీకి సై అంటున్న పార్టీలు:
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. పార్టీలన్నీ ఆ హడావుడిలోనే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా సిట్టింగ్ స్థానం కావడంతో చాలాముందే కేడర్‌ను సంసిద్ధం చేస్తోంది. తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలో నిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. వామపక్షాలు కూడా ఉమ్మడిగా సీనియర్ జర్నలిస్ట్ జయసారథి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. టీజెఎస్ నుంచి కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణిరుద్రమ.. ఇలా చాలా మంది పోటీకి సై అంటున్నారు.జోరు చూపని కాంగ్రెస్, బీజేపీ:
అన్ని పార్టీలు ఏదో ఒక కార్యచరణకు దిగాయి. కానీ అసలైన ప్రతిపక్ష పార్టీలు తమవేనంటూ హడావుడి చేసే కాంగ్రెస్, బీజేపీల్లో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జోరు చూపించడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో రెండవ ప్రాధాన్య ఓటుతో ఆయన గెలిచారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి నిలిచారు. యువత బీజేపీ వైపు కాస్త మొగ్గు చూపించినట్టు కనిపించింది. అలాంటి చోట ఇప్పుడు బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టకపోవడం చర్చనీయాంశం అయ్యింది.

ఓటరు నమోదు ప్రక్రియలో క్రియాశీలకంగా లేని బీజేపీ:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియ కీలకపాత్ర పోషిస్తుంది. ఏ పార్టీ ఎక్కువ ఓటర్లను చేర్చుకుంటుందో.. ఎక్కువగా ఓటర్ల నమోదులో భాగస్వామ్యం అవుతుందో.. ఆ పార్టీ అభ్యర్థికి ఎక్కువగా మద్ధతు లభించడం సాధారణం. గత ఎన్నికల సమయంలో ఓటరు నమోదు ప్రక్రియను బీజేపీ చాలా క్రియాశీలకంగా వినియోగించుకుంది. కానీ ఈ సారి ఆ దిశగా కనీస ప్రయత్నాలు కనిపించడం లేదంటున్నారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీలో ఇటీవల నెలకొన్న పరిణామాలతో కేడర్ కొంత నిరూత్సాహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తలనొప్పిగా మారిన పార్టీలో వర్గ పోరు:
పార్టీలో వర్గ పోరుతో కొంతమంది నేతలు పార్టీ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డికి.. సీనియర్ నేతలకు మధ్య పొసగడం లేదని చెబుతున్నారు. సీనియర్ నేతలంతా శ్రీధర్‌రెడ్డి ఒంటెత్తుపోకడ వ్యవహారాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను భుజంపై వేసుకునేందుకు సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. ఆర్థికంగా కూడా భారం కావడంతో ప్రతి నాయకుడు మనకెందుకులే అని కార్యాలయానికే రావడం మానేస్తున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

ఓటింగ్ నమోదులో పాల్గొనకుండా నేరుగా పోటీకి దిగితే కష్టమే:
పార్టీలో వర్గాలు ఉన్నప్పటికీ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. నల్లగొండ జిల్లాకు చెందిన బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు వెదిరె శ్రీరాం, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జవహర్‌లాల్‌ నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్‌ పెర్యాల చంద్రశేఖర్‌తోపాటు మరో ఆరుగురు ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వెదిరి శ్రీరాం తప్ప మిగిలిన వారంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారే. ఓటింగ్ నమోదులో పాల్గొనకుండా నేరుగా పోటీకి దిగితే కష్టమేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related Tags :

Related Posts :