Home » ఎవరీ ‘గోల్డ్ కింగ్’.. ప్రధాని ఇమ్రాన్ సహా పాక్ మొత్తం ఎందుకు ఒక స్మగ్లర్ మృతికి కన్నీరుమున్నీరవుతోంది?
Published
2 weeks agoon
PM Imran Khan Mourning The Death Of A Gold Smuggler : అతడో గోల్డ్ కింగ్ స్మగ్లర్.. మిలియనీర్.. బంగారం వ్యాపారి.. పరోపకారి కూడా. పాకిస్తాన్లో బంగారం అక్రమ రవాణాతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.. అతడే ప్రముఖ పారిశామ్రికవేత్త సేథ్ అబిద్ హుస్సేన్ (85).. జనవరి 8న మృతిచెందాడు. సేథ్ మరణాన్ని పాక్ జీర్ణించుకోలేక పోయింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా పాకిస్తాన్ ప్రజలంతా సేథ్ మరణవార్త వినగానే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్మగ్లర్ హుస్సేన్ మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించింది.. సమరయోధుడు కాదు.. పెద్ద రాజకీయవేత్త కూడా కాదు.
ఒక గోల్డ్ స్మగ్లర్ మరణిస్తే పాక్ ఇంతగా ఎందుకు విచారం వ్యక్తం చేస్తోంది.. మరి పాకిస్తాన్ అంతగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది. అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. అతడు మాములు వ్యక్తి కాదు.. ప్రపంచానికి సేథ్ గోల్డ్ స్మగ్లర్ గానే తెలుసు.. కానీ, పాకిస్తాన్‌కు వెన్నంటి నడిచిన వీరుడు కూడా. అందుకే ఆయన మరణవార్త వినగానే పాక్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకప్పుడు ఇస్లామిక్ దేశాన్ని అమెరికా నిషేధించిన సమయంలో సేథ్ హుస్సేన్ అణు పునరుత్పత్తి ఫ్యాక్టరీని పాకిస్తాన్‌కు తరలించడంలో కీలక పాత్ర పోషించాడు.
వాషింగ్టన్ నిషేధం అనంతరం ఫ్రాన్స్ నుంచి సముద్ర మార్గాన అణు పునరుత్పత్తి ఫ్యాక్టరీని తీసుకురావడంలో విశేష కృషి చేశారు. తద్వారా పాకిస్తాన్ సొంత అణు ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి హుస్సేన్ తన వంతు సాయం అందించారు. పాక్ అభివృద్ధిలో అంతగా సహకారం అందించిన సేథ్ హుస్సేన్ అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి మరణవార్త వినగానే పాక్ తల్లడిల్లిపోయింది.
సంతాపం తెలిపిన అనంతరం జనవరి 9న కరాచీలోని హఫీజ్ అయాజ్ మసీదులో అంత్యక్రియలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా సేథ్ మరణవార్త వినగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సేథ్ మరణం హృదయ విచారకరమని ట్వీట్ చేశారు. అతను SKMT షౌకత్ ఖనుమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభ దాతలలో ఒకడిగా పేర్కొన్నారు. అతని కుటుంబానికి ఇమ్రాన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Saddened to learn of the passing of Seth Abid Hussain. He was one of the early donors of SKMT. Condolences and prayers go to his family.
— Imran Khan (@ImranKhanPTI) January 10, 2021
అబిద్ హుస్సేన్ 1936లో కసూర్ సరిహద్దు ప్రాంతంలో జన్మించాడు. అది భారతదేశ విభజనకు ముందు కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా)గా మారింది. అక్కడి నుంచి తీసుకువచ్చిన తోలు వ్యాపారం చేసేవారు. 1950లో సేథ్ కరాచీకి వెళ్లాడు. అక్కడే అతని తండ్రి నగరంలోని సారాఫా బజార్.. ఇప్పుడదీ కరాచీ గోల్డ్ మార్కెట్..లో బంగారు, వెండి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. కరాచీ నుండి దుబాయ్ వరకు బంగారు లోహాన్ని అక్రమంగా రవాణా చేసే కొంతమంది మత్స్యకారులతో సంప్రదించాడు.
ఆ తర్వాతే సేథ్ బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. అలా మొదలుపెట్టిన స్మగ్లింగ్ వ్యాపారంతో గోల్డ్ కింగ్ అవతరమెత్తాడు. పాకిస్తాన్ సరిహద్దు బయట అనేక నెట్ వర్కులు ఏర్పాటు చేశాడు. రాష్ట్ర ఉన్నతవర్గాలతో, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలతో సత్సంబంధాలు కొనసాగించాడు. అలా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పాకిస్తాన్ లోపల బంగారం స్మగ్లింగ్‌లో సేథ్ అబిద్‌కు భారీ పాత్ర ఉందని చెబుతుంటారు. ప్రత్యేకించి 1950 నుంచి 1980 వరకు హుస్సేన్ బంగారు అక్రమ రవాణాతో ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ల దృష్టిని ఆకర్షించాడు. లండన్, ఢిల్లీ దుబాయ్‌తో పాటు పాకిస్తాన్ వెలుపల స్మగ్లింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేశాడు. 1970లో ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో హయాంలో సేథ్ స్మగ్లింగ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆ తరువాత అతని అనేక ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. 1977లో హుస్సేన్ స్వచ్ఛందంగా మొహమ్మద్ జియా-ఉల్-హక్ సైనిక పాలనకు లొంగిపోయాడు. జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ హాస్పిటల్ (JPMC) నిర్మాణ ప్రాజెక్టు కోసం హుస్సేన్ సుమారు రూ .151,000 పెద్ద గ్రాంటును కూడా ఇచ్చారని చెబుతారు. అదే అతడ్ని బంగారం స్మగ్లర్ నుంచి దేశభక్తుడిగా మార్చేసింది. ఆ తర్వాత పరోపకారిగా అవతారమెత్తి.. దివ్యాంగ చిన్నారుల సంక్షేమం కోసం హమ్జా ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలను స్థాపించాడు. లాహోర్‌లోని షౌకత్ ఖనుమ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభ దాతగా మారాడు. అలా ఎన్నో సంఘసేవలు చేస్తూ పాక్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.