నియోజకవర్గం మొత్తం తిరుగుతారు, కానీ ఆ గ్రామానికి మాత్రం వెళ్లేది లేదని శపథం చేసిన వైసీపీ ఎమ్మెల్యే, కారణమేంటి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

mla Annamreddy Adeep Raj: ఆ గ్రామానికి వెళ్లనని స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ దేశంలోనే అతి పెద్ద ఫార్మా సిటీగా గుర్తింపు పొందింది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోకి ఈ ఫార్మా సిటీ వస్తుంది. దీనికి ఆనుకొని తాడి అనే గ్రామం ఒకటి ఉంది. ఫార్మా పరిశ్రమలకు ఆనుకొని ఉండటంతో ఇక్కడ భూగర్భ జలాలతో పాటు అన్నీ కలుషితం అయ్యాయి. రోజూ తాగే నీటిని ఈ గ్రామస్థులు కొనుక్కుంటారు. ఈ గ్రామ జనాభా 1800. గత మూడు ఎన్నికల నుంచి ఈ గ్రామాన్ని తరలించడం అనేది ఒక హామీగా ఉంది.

గ్రామం తరలించిన తర్వాత కొత్త గ్రామంలోనే అడుగు పెడతానన్న అదీప్‌రాజ్‌:
2019 ఎన్నికల ముందు తాడి గ్రామాన్ని తరలించేందుకు జీఓ నెం 29 విడుదలైదని నాటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హడావుడి చేశారు. దీనికి సంబంధించి 57.63 కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యాయి. గ్రామస్థులకు పెదముషిడివాడ దగ్గర సైట్‌ను కూడా చూపించారు. ఈలోపు ఎన్నికలు రావడంతో అది అక్కడే నిలిచిపోయింది. ఎన్నికల ముందు ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజ్ నేతృత్వంలో తాడి గ్రామస్థులు జగన్ ని కలిశారు. ఈ సందర్భంగా తాడి గ్రామాన్ని తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారు కూడా. గ్రామాన్ని తరలించే వరకూ తాను ఆ ఊరిలో కాలు పెట్టనని, తరలించిన కొత్త ఊరిలోనే తాను అడుగు పెడతానని శపథం చేశారు అదీప్ రాజ్.

పక్కా భవనాలు విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమంటున్న గ్రామస్థులు:
ఈ గ్రామాన్ని వెంటనే తరలించాలని ప్రజలు కోరుతున్నారు. కాలుష్యం నుంచి తమను కాపాడాలని స్థానిక అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యమైపోయాయి. శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. పక్కా భవనాలను సైతం విడిచి తాము వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నామని స్థానికులు అంటున్నారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ చాలా కార్యక్రమాలు చేపడుతున్నా.. ఈ గ్రామానికి మాత్రం రావడం లేదని చెబుతున్నారు. గ్రామం తరలించే వరకూ రానని ఎమ్మెల్యే అంటుంటే.. ఎప్పటికి తరలిస్తారని ప్రజలు అడుగుతున్నారు.

ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు:
ఫార్మా సిటీలో ఇటీవల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థుల్లో ఆందోళన పెరుగుతోంది. గ్రామాన్ని తరలించడంలో జాప్యంపై అధికార, ప్రతిపక్షాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. నాటి వైఎస్సార్‌ సర్కారు అనుసరించిన నిర్ణయాల కారణంగానే తాడి ప్రజలు బాధలు పడుతున్నారని టీడీపీ అంటోంది. ఒక కమిటీ వేసి, ఆ నివేదిక మేరకు ప్రజలకు నష్టపరిహారాన్ని ఇప్పించడంతోపాటుగా వేరే ప్రాంతానికి తరలించేందుకు సైట్‌ను కూడా ఫైనల్ చేశామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆర్ ఎండ్ ఆర్ డిపార్ట్‌మెంట్‌కు డబ్బు రిలీజ్ చేయాలంటూ ఆర్డర్స్‌ వచ్చాయని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెబుతున్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు.

అధికారంలోకి వచ్చినా ఏం లాభం, తీవ్ర నిరాశలో వైసీపీ నేతలు


ఏడాదిన్నర నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్న:
గ్రామాన్ని తరలించి గ్రామస్థులు సంతోషంగా ఉన్నప్పుడు వెళ్లాలన్నదే తన ఉద్దేశమని వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ అంటున్నారు. తొందరలోనే అన్ని చర్యలు తీసుకుంటామని, ఆ గ్రామంలోకి తాను అప్పుడే వెళ్తానని చెబుతున్నారు. కాకపోతే ఇప్పటి వరకూ ప్రభుత్వ పరంగా ఈ గ్రామం విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో.. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో? తమ ఎమ్మెల్యే ఎప్పుడొస్తారో? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ విషయంలో ఏడాదిన్నర నుంచి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చారు సరే.. గ్రామానికి రాకుండా ఉంటే పనులు జరిగిపోతాయా అడుగుతున్నారు. ఈ విషయంలో అదీప్‌రాజ్‌ మాట నిలబెట్టుకుంటారా?

Related Tags :

Related Posts :