లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అడ్రస్ లేని కాంగ్రెస్, దీనికి కారణమేంటి

Published

on

congress no address: జనం కాంగ్రెస్‌ని పట్టించుకోవడం లేదు. అసలు మా పార్టీ ఉందనే అనుకోవడం లేదు. అచ్చంగా ఇవే మాటలు కాదు కానీ.. ఇలానే చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. బహుశా అందుకేనేమో గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ టిక్కెట్ల కోసం పెద్దగా పోటీ కన్పించడం లేదు. సిటీ టూ స్టేట్.. స్టేట్ టూ సెంటర్ ఎక్కడైనా సరే.. కాంగ్రెస్ పార్టీ అంటేనే దూరం జరుగుతున్నారు ఓటర్లు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ అధినాయకత్వం వైఖరే కారణమంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దయనీయ స్థితి:
కాంగ్రెస్ ఎక్కడ..? తాజాగా దుబ్బాకలో డిపాజిట్ పోగొట్టుకున్న తర్వాత కాంగ్రెస్ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న.. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వలసలు, వరుస ఓటములు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు ఊరంతా ఒకదారి అయితే.. ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుగా తయారైంది గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి. ఓవైపు బల్దియా పోరు కోసం టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా అభ్యర్ధుల ఎంపిక.. దానిపై అసంతృప్తితో సతమతం అవుతుంటే..కాంగ్రెస్‌లో మాత్రం సౌండ్ లేదు.

ఇతర పార్టీల్లోకి కాంగ్రెస్ నేతలు జంప్:
అంతేకాదు.. కాంగ్రెస్‌తో ఇక మనకి ఒరిగేది శూన్యం అనుకున్నారో.. లేక పార్టీ ఔట్‌ డేటెడ్ అయిపోయిందనుకున్నారో కానీ.. ఆ పార్టీలోని చోటామోటా లీడర్లు కూడా పక్క పార్టీల్లోకి జంపవుతున్నారు. ఈ లిస్టులో పెద్ద పెద్ద నేతలే ఉన్నారంటారు. అలానే మాజీ ఎమ్మెల్యే బిక్షపతినాయక్, ఆయన కుమారుడు రవి..టీ కాంగ్ మహిళా విభాగం నేత గోదావరి కూడా కాంగ్రెస్ కి హ్యాండిచ్చేశారు. ఒక్క దుబ్బాక విజయం బిజెపిలో జోష్ నింపితే.. కాంగ్రెస్‌లో మాత్రం చడీ చప్పుడూ లేదు.. పైగా ఆ పార్టీ చీఫ్ మాటలను కూడా లీడర్లు ఖాతరు చేయడం లేదంటున్నారు. దీనికి తోడు బీజేపీ నేతలు కాంగ్రెస్ లోని ముఖ్య నేతలకు గాలం వేస్తుండడం ఆ పార్టీకి నిద్ర పట్టకుండా చేస్తోంది.

వర్గపోరు.. కుమ్ములాటలతో నడిపించే నాయకుడే కరువు:
ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన హైదరాబాద్ కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తికా రెడ్డి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ఎల్బీ నగర్ కు చెందిన కాంగ్రెస్ కీలక నేత కొప్పుల నర్సింహారెడ్డి సైతం బీజేపీలో చేరిపోయారు. అసలే కాంగ్రెస్‌కి జిహెచ్ఎంసిలో ఉన్న నంబర్ సింగిల్ డిజిట్.. ఇప్పుడు ఆ నంబర్ కూడా దక్కకపోతే.. పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతవుతుంది. పార్టీలో లీడర్లు భారీగా కన్పిస్తున్నా..వర్గపోరు..కుమ్ములాటలతో పార్టీని నడిపించే వారు లేకుండా పోయారు. అందరూ లీడర్లే అయితే ఇక పల్లకీ మోసేవాళ్లెవరన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి..ఒక్క గ్రేటర్‌లోనే కాదు..తెలంగాణ వ్యాప్తంగా..ఆ మాటకి వస్తే..ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే సిచ్యుయేషన్.

తెలివైన నేతలు టీడీపీ, వైసీపీలోకి జంప్:
2014 తర్వాత కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల దగ్గర విశ్వాసంతో పాటు.. డిపాజిట్లు కూడా కోల్పోయింది..ఏ ఎన్నిక జరిగినా..అసలా పార్టీ ఉందనే సంగతే జనం మర్చిపోయారు..తెలివైన నేతలు ఈ పరిణామం గ్రహించే అటు టిడిపిలోనో.. ఇటు వైఎస్సార్సీపీలోనో తమ రాజకీయ జీవితం కంటిన్యూ చేశారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ ఎంత కష్టపడినా..ఆ పార్టీని పట్టించుకోవడానికి రాష్ట్రస్థాయిలో నేతలంటూ లేకుండాపోయారు..వాస్తవానికి ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన స్థితి కాదు.

కాంగ్రెస్ ని దెబ్బతీసిన రాహుల్ గాంధీ తత్వం:
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కాంగ్రెస్ ఇప్పుడు మీకు ఎంత వెతికినా కన్పించదు.. పార్టీ పేరు గొప్ప ఊరు దిబ్బలా మారిపోయింది..దీనికి అధినాయకత్వం లోపమే ప్రధాన కారణం..కాడిని మోసి..విజయతీరాలకు చేర్చాల్సిన తరుణంలో అడ్డంగా దాన్ని వదిలేసే రాహుల్ గాంధీ తత్వం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసిందంటారు..అప్పుడప్పుడూ ఓ ధర్నాలో మెరవడం..ప్రధానమంత్రి మోదీపై రెండు పంచ్ డైలాగులు వేయడం.. అదైపోయిన తర్వాత తిరిగి మాయం కావడం ఇదే ఆయన తీరు..ఆ తర్వాత ట్విట్టర్లో ప్రశ్నలను పదునుగా సంధించే రాహుల్..పార్టీ పగ్గాలు వద్దంటారు..మళ్లీ పెత్తనం మాత్రం తనకే కావాలంటారు.

కాంగ్రెస్ లో ఎదుగుదలకు చాన్స్ లేదు:
సోనియాగాంధీ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికై..మూడు నాలుగు నెలలు అవుతున్నా..కొత్త నేత ఎంపిక ఎందుకు ఆలస్యం అవుతుందో ఎవరికీ తెలీదు..ఇలా వందేళ్లు దాటిన కాంగ్రెస్ పార్టీకి నేషనల్ లెవల్లోనే ఓ లీడర్ లేనప్పుడు..ఇక రాష్ట్రాల్లో మాత్రం ఎలా బలమైన నాయకులు వస్తారు.. వచ్చినా వారిని ఎదగనీయకుండా ఉండటమనే కాంగ్రెస్ సూత్రం ఆ పార్టీపై సీనియర్ నేతలకు..యువ నాయకులకు అసహనం చికాకు పుట్టించేలా చేస్తోంది.. అందుకే ఈ ఏడాదిలో జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి గుడ్ బై చెప్పేసి బిజెపిలోకి వెళ్లిపోయారు.. రాజస్తాన్‌లోనూ ఇదే తరహాగా సచిన్ పైలెట్ బైటికి వెళ్లినా తిరిగి వచ్చారు..ఐతే మళ్లీ అక్కడ అశోక్ గెహ్లోట్, సచిన్ పైలెట్ మధ్య చిచ్చు రగులుకుంటుందంటున్నారు.

ప్రతిపక్ష పాత్రని కూడా ఇతర పార్టీలకు అప్పగించేసింది:
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఐతే కాంగ్రెస్ మాత్రం వరస ఓటములు పాలవుతున్నా, అధినాయకత్వం వైఖరిలో మార్పు రాలేదు. అంతేకాదు పార్టీ నుంచి వలసలు పెరిగిపోతున్నా.. పట్టించుకోదు. ఓ వైపు బిజెపి దెబ్బకి మెజారిటీ రాష్ట్రాల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఐతే ఇప్పుడు ఆ ప్రతిపక్ష పాత్రని కూడా ఇతర పార్టీలకు అప్పగించేసి చేతులెత్తేస్తోంది. ఇక్కడే ప్రత్యర్థి వ్యూహాలకు కాంగ్రెస్ చిత్తైపోయిన వైనం కన్పిస్తోంది. అందుకే జనం కూడా ఆ పార్టీని నమ్మడం మానేశారంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *