ప్రకాశంలో సైకిలుకు పంక్చర్లు.. నేతల్లో ఎందుకీ సైలెంట్..?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రకాశం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ సునామీని సైతం తట్టుకొని ఇతర జిల్లాల కంటే చెప్పుకోదగ్గ స్థానాలను ఇక్కడ దక్కించుకుంది. జిల్లాలోని ఒక్క పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాల్లో తన ఆధిపత్యం చలాయించిన సైకిల్‌కు ఇప్పుడు పంక్చర్లు పడ్డాయి.

దానికి మరమ్మతులు చేసేవారు లేక, ఒకవేళ చేసినా నడుస్తుందనే నమ్మకం లేకపోవడంతో ఇప్పుడు నాయకులు ప్రజాసమస్యలను గాలికి వదలి తమ సొంత పనులు, వ్యాపారాలు చూసుకుంటూ కిమ్మనకుండా ఉన్నారని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు జిల్లా టీడీపీలో ఇలాంటి పరిస్థితి ఏనాడూ లేదు. నాయకుల్లో ఇలాంటి పిరికితనాన్ని చూడలేదని టీడీపీ అభిమానులు ఫీలవుతున్నారు.

సైలెంట్ అయిన బలమైన నేతలు :
జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకుల్లో గొట్టిపాటి హనమంతరావు, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి రామానాయుడు, కాటూరి నారాయణ చౌదరి, ఇరిగినేని తిరుపతి నాయడు, కరణం బలరాం, ముక్కు కాసిరెడ్డి, దామచర్ల ఆంజనేయులు, చెంచు గరిటయ్య లాంటి ఎందరో నాయకులు ప్రముఖులుగా పేరొందారు. వీరిలో కొందరు మరణించగా, మరికొందరు వేరే పార్టీల్లో సెటిల్‌ అయిపోయారు.

గత పరిస్థితిని పక్కనబెడితే ఇటీవల పార్టీ మారిన కరణం బలరాం, శిద్దా రాఘవరావు లాంటి కరుడుగట్టిన టీడీపీ నాయకులు లేకపోయినా స్థానికంగా ఎంతోకొంత ప్రభావం చూపగలిగే ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరంజనేయ స్వామి, దామచర్ల జనార్దన్ లాంటి బలమైన నేతలు సైతం సైలెంట్‌ అయిపోవడం చర్చనీయాంశమైంది.

తెలుగు తమ్ముళ్లలో అయోమయం :
జిల్లాలో ప్రజా సమస్యలు టీడీపీ నేతలెవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. అధిష్టానం పిలుపునిచ్చినా ఎవరూ కనీసం స్పందించని పరిస్థితి నెలకొంది. గతంలో ఎక్కడ ప్రజా సమస్యలున్నా టీడీపీ దండు ముందుండి పోరాటం చేసేది. నాయకులు కూడా ముందుండేవారు. కానీ, అలాంటి నాయకులు ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్‌ అయిపోయారంటూ తెలుగు తమ్ముళ్లు మధనపడిపోతున్నారట.

2009 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘోర పరాభవాన్ని చవిచూడటంతో అప్పటి జిల్లా అధ్యక్షుడు కరణం బలరాం ఓటమికి బాధ్యతగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ బాధ్యతలను మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వారుసుడు జనార్దన్‌ తీసుకున్నారు. 2009లో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2019 ఎన్నికల వరకు అన్ని విధాలా పార్టీకి అండగా ఉన్నారు.

జిల్లాలోని ప్రతినాయకుడి దగ్గర నుంచి ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుండి నడిపించేవారు జనార్దన్‌. స్థానికంగా తన వ్యాపార వ్యవహారాల కంటే జిల్లాలోని పార్టీ కార్యకలాపాలపైనే ఎక్కువగా దృష్టి సారించి అధిష్టానం వద్ద మంచి పేరును సంపాదించారు.

READ  జగన్ క్లారిటీ.. గవర్నర్ నోటి వెంట పరిపాలన రాజధానిగా విశాఖ

దీంతో 2012లో వైసీపీ ఆవిర్భావంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి జనార్దన్‌కు అవకాశం కల్పించగా బాలినేని చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కూడా పార్టీ బాధ్యతలు కొనసాగిస్తూ ముందుకు సాగారు. 2014 ఎన్నికల్లో మరోసారి ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచారు.

ఒంగోలు వైపు కన్నెత్తి చూడటం లేదంట :
నియోజకవర్గంలో జెండా పాతేందుకు నగర అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు జనార్దన్‌. కానీ, 2019 ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఒంగోలు నగరం వైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేనిలా అడపా దడపా ఏదో పార్టీ బాధ్యతలు చూశామంటే చూశామంటూ పార్టీ కార్యాలయం వైపు తొంగి చూస్తే సరిపోతుందని ఫిక్సైపోయారట.

ఇప్పుడు పూర్తి స్థాయిలో తన వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలపైనే దృష్టి సారించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. జిల్లా అధ్యక్షుడి పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలోని నియోజకవర్గ నాయకుల వ్యవహారం మరోలా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అనంతరం అసలు తాము టీడీపీ నేతలని చెప్పుకోవడానికి కూడా బెంబేలెత్తిపోతున్నారట.

జిల్లాలో గ్రానైట్ నుంచి అనేక వ్యాపారాల్లో టీడీపీ నాయకులున్నారు. తమ ఆర్ధిక లావాదేవీల్లోని లొసుగులపై అధికార పార్టీ ఎక్కడ టార్గెట్ చేస్తుందోనని భయంతో అసలు ప్రజా సమస్యల గురించి కానీ, ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడడం లేదంటున్నారు.

తమ పనులు తాము చూసుకుంటున్నారు తప్ప ఇతరత్రా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టడం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరి పార్టీని గట్టెక్కించేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Related Posts