లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

అమరావతి పోరాటంలో పవన్‌, వీర్రాజు చెప్పేదేంటి?

Published

on

బీజేపీ, జనసేన అధ్యక్షుల వ్యవహార శైలి అమరావతి రైతుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకపక్క కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల చిరంజీవిని కలవడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సందర్భంగా చిరంజీవి అన్న మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి.జనసేన పార్టీతో కలిసి ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయన కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా, మంత్రిగా పని చేయడంతో ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. ఈ మాటల వెనుక అర్థమేంటన్నది ఎవరి ఆలోచనలకు అందడం లేదంటున్నారు. ఈ రెండు పార్టీలకు చిరంజీవి పరోక్ష మద్దత్తు ఇస్తున్నారని అనుకుంటున్నారు.

పవన్ మాట ఇదే :
ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే సోము వీర్రాజు, మిత్ర పక్షం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని జనసేన కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం కలిశారు. ప్రధానంగా అమరావతిలోని రైతుల సమస్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నామని, ఈ విషయాలపై మరింత కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు.జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సభ్యులు, బీజేపీ సభ్యులతో కలసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుకోవాలంటే రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలన్నది ఆయన వాదన. బీజేపీ తీసుకున్న స్టాండ్ ఏంటంటే అన్ని కార్యకలాపాలు అమరావతిలోనే ఉండాలి హై కోర్ట్ మాత్రం రాయలసీమలో ఏర్పాటు చేయాలి.

బీజేపీ అసలు స్టాండ్ ఏంటి? :
ఇప్పుడు బీజేపీ పాత స్టాండ్ గురించి అసలు మాట్లాడటం లేదు. రాజధాని రైతుల సమస్యలపై మాత్రం పోరాటం చేయాలని పవన్‌తో సోము వీర్రాజు తెలిపారు. ప్రస్తుతం పవన్ అంటున్నదేమో అమరావతి రాజధానిగా ఉండాలి.. రైతులకు న్యాయం జరగాలని.. మరి బీజేపీ మాత్రం రైతులకు మాత్రం న్యాయం జరగాలని అంటోంది తప్ప రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పడం లేదు.

ఇలా మిత్ర పక్షాల మధ్య ఒకే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం అయోమయం కలిగిస్తోందని రెండు పార్టీల కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇద్దరు నేతల మాటల్లో పొంతన లేకపోవడంతో అసలు వారికి ఈ విషయంలో క్లారిటీ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు క్లారిటీ మిస్ అయిందా? :
అమరావతి రాజధానిగా ఉండాలని పవన్ అంటుంటే, రాజధాని రైతులకి న్యాయం జరగాలని సోము వీర్రాజు అంటున్నారు. ఇక్కడే క్లారిటీ మిస్సయింది. కలిసి పనిచేసేది ఒక్కటిగా అయినప్పుడు రెండు భిన్న స్వరాలు ఎలా వినిపిస్తారనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రాజధాని కోసం రైతుల తరఫున న్యాయపోరాటం చేస్తామన్న పవన్… సోము వీర్రాజు చెప్తున్న మాటలకు ఎలా అంగీకరిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న.

గతంలో ఇలాగే బీజేపీ నాయకులు చివరి దాకా లాగారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంటుందంటే సుజనా చౌదరి దానికి వంత పాడుతూ కేంద్రం జోక్యం ఉంటుందని చెప్పుకొచ్చేవారు. ఎంపీ
జీవీఎల్ నరసింహారావు మాత్రం కేంద్రానికి సంబంధం లేదని చెప్పేవారు.బీజేపీ మొదటి నుంచి కూడా పొంతన లేని మాటలతో రైతుల్లో ఆశలు రేపింది. ఇప్పుడు మిత్ర పక్షాలుగా ఉన్న నాయకులు ఒకే స్టాండ్ లేకుండా ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారో అన్నది ఆ రెండు పార్టీ కార్యకర్తల్లో ఉన్న అనుమానం. ఇటీవల జరిగిన భేటీలో సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ మధ్య అమరావతి రాజధానికి సంబంధిచిన ప్రశ్న అసలు ఉత్పన్నం కాలేదనేది ఆ పార్టీ నేతల వాదన. పవన్ కూడా రాజధాని రైతులకు ఎలా న్యాయం చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు తప్ప.. రాజధాని కోసం పోరాడతాం అనలేదని చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ కూడా రాజధానిని పక్కన పెట్టి రైతులకి జరగాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తారా? అన్నది చూడాలి. అమరావతి కోసం న్యాయ పోరాటం చేయాలనుకుంటే బీజేపీకి విరుద్ధంగా ఉన్నట్టే అంటున్నారు. గతంలో బీజేపీ నాయకులు చేసిన కన్‌ఫ్యూజన్ ఇప్పుడు కూడా కొనసాగిస్తారా? క్లారిటీతో ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాల్సిందే. మిత్రపక్షాలుగా ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్లకుండా వేర్వేరు అర్థాలతో మాట్లాడితే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *