విజయశాంతికి ఏమైంది.. గాంధీభవన్ వైపు కన్నెత్తి చూడటం లేదు, దుబ్బాకలో పోటీకి ఒప్పుకోవడం లేదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ కాంగ్రెస్‌కు స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి. కానీ, చాలా కాలంగా ఆమె యాక్టివ్‌ పాలిటిక్స్‌లో కనిపించడం లేదు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లో సైతం తన ముద్ర వేసిన విజయశాంతి… మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తలో బాగా దూకుడుగా కనిపించేవారామె. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించేవారు. కానీ, ఇటీవల కాలంలో పూర్తి సైలెంట్‌గా మారిపోయారు.

ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న తన సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవడం లేదని సన్నిహితుల వద్ద ఆమె వాపోతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్టీ ముఖ్యనేతలు తన పట్ల చూపిస్తున్న వైఖరి ఆమెకు నచ్చడం లేదంటున్నారు. అందుకే విజయశాంతి గాంధీభవన్ వైపు కన్నెత్తి చూడటం లేదట.

కీలక సమావేశానికి రాములమ్మ డుమ్మా:
కాంగ్రెస్ నేతల తీరుతో అతి కీలకమైన సమావేశానికి సైతం విజయశాంతి దూరంగా ఉన్నారు. త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికపై అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున నిర్వహించిన సమావేశానికి ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి డుమ్మా కొట్టారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలిగా పని చేసిన విజయశాంతి…. అదే పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగే ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి డుమ్మా కొట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. దుబ్బాక నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో కూడా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.

దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయశాంతి?
విజయశాంతిని ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భావిస్తున్నారట. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు కూడా లేరంటున్నారు. అక్కడ ప్రత్యర్థులకు పోటీనిచ్చే అభ్యర్థులు లేరంటున్నారు. ఉన్న ఒకరిద్దరు నేతలకు కూడా అంత పట్టు లేకపోవడంతో విజయశాంతిని ఎలాగైనా రంగంలోకి దించాలని ప్లాన్‌ చేస్తున్నారట. కానీ, ఆమె మాత్రం ఇందుకు సిద్ధంగా లేనని చెబుతున్నారట.

మూడేళ్ల పదవీకాలంతో పాటు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతోనే విజయశాంతి పోటీకి వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. పార్టీలో విజయశాంతి గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుండటంతో… పీసీసీ ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారట. విజయశాంతి ప్రస్తుతం ఒక ప్రత్యేక పూజ చేస్తున్నారని.. అందుకే ఆమె బయటకు రావడం లేదని చెబుతున్నారట.

మరి విజయశాంతిని దుబ్బాకలో పోటీ చేసేలా పార్టీ ముఖ్య నేతలు ఒప్పించగలరా? అనే అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పార్టీ నేతల తీరుతోనే దూరంగా ఉంటున్న ఆమె.. అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. కొద్ది రోజుల్లో ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
Related Posts