అశోక్ గజపతినే ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విజయనగరం సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘనమైన చరిత్ర ఉన్న విజయనగరం సంస్థానానికి వారసుడిగానే కాకుండా, రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అశోక్ గజపతిరాజు.. ఇప్పుడు అధికార పక్షం వదులుతున్న బాణాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారై పోతున్నారట. ఆయన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా దెబ్బతీయడంతో పాటు పార్టీపరంగా కూడా ఒంటరివాడిని చేస్తూ అధికార పక్షం పావులు కదుపుతోందని అంటున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అశోక్ గజపతిరాజుకు వరసగా దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత అనారోగ్యంతో కొన్నాళ్లపాటు ఆసుపత్రి పాలయ్యారు. తిరిగి కోలుకొని జిల్లాకు చేరుకున్న ఆయనకు అధికార పక్షం తేరుకోలేని దెబ్బకొట్టింది. మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా ఉన్న ఆయన్ని తప్పించి, తన అన్న కుమార్తె సంచైత గజపతిరాజును నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో… అందరినీ నివ్వెరపరిచేలా చేసింది. విజయనగరం రాజుల సంస్థానానికి గుండెకాయ లాంటి మాన్సాస్ ట్రస్టును వేరొకరికి అప్పగించడం అశోక్ గజపతిరాజు కుటుంబానికి గట్టి షాకే అంటున్నారు.

అధికార పక్షం ఉచ్చు బిగించిందా? :
మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం దేవస్థానం చైర్మన్ బాధ్యతల నుంచి కూడా అశోక్‌ను తప్పించింది ప్రభుత్వం. ఈ షాక్‌లో ఉండగానే, విజయనగరం పట్టణంలో చారిత్రక కట్టడమైన మూడులాంతర్ల స్తంభం కూల్చివేత అశోక్ కుటుంబాన్ని మరింతగా కుంగదీసింది. మరోపక్క ఆయన ట్రస్టు చైర్మన్‌గా ఉండగా జరిగిన భూముల అమ్మకాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందంటున్నారు. మొత్తంగా ఊపిరి తీసుకోలేని విధంగా ఆయన చుట్టూ అధికార పక్షం ఉచ్చు బిగించడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయాల్లో మచ్చలేని నాయకుడుగా పేరుపడిన అశోక్ గజపతినే ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది? జిల్లాలో మరో రెండు మూడు రాజుల సంస్థానాలుండగా, ఆయనపైనే ఎందుకు ఫోకస్ పెట్టిందనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు పెద్ద దిక్కుగా ఉన్నారు.

పార్టీ పరంగా ఎవరు ఏ పదవుల్లో ఉన్నా అశోక్‌దే తుది నిర్ణయం. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ల నుంచి పార్టీ పరమైన పదవుల పంపకం వరకూ అశోక్ గజపతిరాజు కనుసనల్లోనే జరుగుతుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జిల్లాలో టీడీపీ అంటే అశోక్ గజపతిరాజే. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఆయనను టార్గెట్‌ చేస్తోందని అంటున్నారు.

వైసీపీ వ్యూహం ఇదేనా? :
పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజును దెబ్బతీస్తే జిల్లాలో పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చన్న ఉద్దేశంతోనే ఈ తరహా వ్యూహాన్ని ఎన్నుకుందని రాజకీయ వర్గాల్లో టాక్‌. జిల్లాలో విజయనగరం సంస్థానంతో పాటు బొబ్బిలి, కురుపాం రాజుల సంస్థానాలు కూడా ఉన్నాయి. వీటిలో బొబ్బిలి సంస్థానం కూడా పెద్దదే.

READ  మోడీ, అమిత్ షాతో త్వరలో ముస్లిం నేతలు, మతగురువుల భేటీ

ఆ సంస్థానాల రాజ కుటుంబీకులు కూడా ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. వారి జోలికి పోకుండా, విజయనగరం రాజుగారి మీదే అధికార పక్షం పోకస్ పెట్టడమే విశేషం. అశోక్‌ను నైతికంగా దెబ్బతీయడం ద్వారా జిల్లాలో పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని టీడీపీ కేడర్‌ విమర్శిస్తోంది. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు దాదాపు ఒంటరివారై పోయారని అంటున్నారు.

అధికార పక్షం దూకుడుతో టీడీపీలో మిగిలిన నేతలు సైలెంట్‌ అయిపోయారట. బొబ్బిలి, కురుపాం రాజులైతే పత్తా లేకుండాపోయారు. రాజకీయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే… ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో జిల్లాలోని టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండటంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వ్యవహారాలన్నింటినీ అశోక్ గజపతిరాజు చక్కబెట్టి… పార్టీని తిరిగి గాడిలో పెట్టగలరా? లేదా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న.

Related Posts