భర్త బిర్యానీ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నానో, అనుమానంతో చిత్ర హింసలు పెడుతున్నాడనో, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనో.. భార్యలు ఆత్మహత్యలు చేసుకోవడం చూశాం. కానీ, భర్త బిర్యానీ కొనివ్వలేదనే కారణంతో భార్య ఆత్మహత్య చేసుకోవడం చూశారా. కనీసం విన్నారా. షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. భర్త తనకు బిర్యానీ కొనివ్వలేదనే కారణంతో ఆ భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఏకంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో మరణించింది.

బిర్యానీ కొనివ్వాలని భర్తను అడిగింది:
తనకు బిర్యానీ కొనివ్వలేదన్న మనస్తాపంతో భర్తపై అలిగి ఓ వివాహిత ఆత్మాహుతి చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రం మహాబలిపురంలో జరిగింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల కూతురు ఉన్నారు. మహాబలిపురంలోని శిల్పాల తయారీ సంస్థలో మనోహరన్‌ పనిచేస్తున్నాడు.

మనస్తాపంతో ఆత్మహత్య:
గురువారం(జూన్ 26,2020) తనకు బిర్యానీ తినాలని ఆశగా ఉందని, కొనిపెట్టాలని భర్తను కోరింది శరణ్య. అయితే తన దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉందని, మరోసారి కొనిస్తానని మనోహర్ చెప్పాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. భర్త అలా చెప్పడంతో శరణ్య మనస్తాపం చెందింది. భర్త మీద కోపం వచ్చింది. అదే కోపంలో ఇంటి బయట పార్క్ చేసి ఉన్న భర్త బైక్‌ దగ్గరికి వెళ్లింది. బైక్ లో ఉన్న పెట్రోల్‌ను తీసింది. దాన్ని తనపై పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇది గమనించిన ఇరుగు పొరుగు వాళ్లు వెంటనే అక్కడికి వచ్చారు. మంటలను ఆర్పివేశారు. భర్తకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సాయంతో మనోహరన్ తన భార్యని మహాబలిపురంలోని ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో శరణ్య చనిపోయింది.

హోటల్ బిర్యానీ అంటే శరణ్యకు మహా ఇష్టం:
పెళ్లయిన తర్వాత మనోహరన్ తన భార్య శరణ్యకు హోటల్ నుంచి రుచికరమైన బిర్యానీ తెచ్చివ్వడం మొదలు పెట్టాడు. ఇంట్లో చేసిన బిర్యానీ కంటే హోటల్ నుంచి తీసుకెళ్లే బిర్యానీని శరణ్య ఎంతో ఇష్టంగా తినేది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్త మనోహరన్ అప్పుడప్పుడు బయటనుంచి బిర్యానీలు ఇంటికి పార్శిల్ తీసుకెళ్లేవాడు.

బిర్యానీ కోసం భర్తతో గొడవ, ఆపై దారుణం:
కాగా, శిల్పిగా పని చేస్తున్న మనోహరన్ కు లాక్ డౌన్ దెబ్బతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఇదే సమయంలో భార్య శరణ్య బిర్యానీ అడిగింది. అయితే భార్య, ఇద్దరు పిల్లలకు మూడు బిర్యానీలు కొనాలంటే రూ. 600కు పైగా ఖర్చు అవుతుందని, ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదని, మరోసారి కొనిస్తానని భర్త మనోహరన్ భార్య శరణ్యకు చెప్పాడు. దీనికి శరణ్య బాగా హర్ట్ అయ్యింది. నేను ఏమైనా మనులు, మాణిక్యాలు అడిగానా, ఆఫ్ట్రాల్ బిర్యానీ అడిగితే తెచ్చివ్వలేవా ? అంటూ భర్త మనోహరన్ తో గొడవ పెట్టుకుంది. ఇంట్లో ఉంటే బిర్యానీ గొడవ ఎక్కువ అవుతుందని, తన భార్య అంత ఈజీగా ఈ విషయం వదిలిపెట్టదని గ్రహించిన భర్త మనోహరన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కాసేపు ఆగితే భార్య కోపం తగ్గుతుందని అనుకున్నాడు. మనోహరన్ అలా ఇంటి నుంచి వెళ్లి పోవడంతో శరణ్య రగిలిపోయింది. అఘాయిత్యానికి ఒడిగట్టింది.

ఈ ఘటన భర్త మనోహర్ తో పాటు స్థానికులను షాక్ కి గురి చేసింది. తన భార్య ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదని భర్త కంటతడి పెట్టాడు. ఇంత చిన్న కారణానికే శరణ్య ఇలా చేసిందని తెలిసి ఇరుగు పొరుగు వారు విస్తుపోయారు. భర్త ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా శరణ్య తొందరపడిందని వాపోయారు.

Related Posts