వైఎస్ హయాంలో చక్రం తిప్పిన ఆ వైసీపీ సీనియర్ నేతకి మళ్లీ మంచి రోజులు వస్తాయా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

anam ramanarayana reddy: రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈ కుటుంబానికి చెందిన పాతతరం నాయకులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి దగ్గర నుంచి ఈ తరం నాయకులు ఆనం రామనారాయణరెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినవాళ్లే. అటు జిల్లాలోనూ తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం సోదరులు జిల్లా రాజకీయాలను శాసించారు.

వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్‌ కుటుంబానికి దూరమైన ఆనం సోదరులు:
వైఎస్సార్‌ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆనం సోదరులైన వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డిలు వైఎస్ కుటుంబానికి దూరమయ్యారు. పలు సందర్భాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్‌ను కూడా విమర్శించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం.. 2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ వైసీపీలోకి చేరడం, ఎన్నికల్లో పోటీ చేసి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి.

వైసీపీలో ప్రాధాన్యం దక్కడం లేదా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు. శాశ్వత మిత్రులు లేరు. కానీ, రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరినప్పటికీ గతంలో ఆనం రామనారాయణరెడ్డికి వైఎస్ కుటుంబానికి ఏర్పడిన గ్యాప్ మాత్రం తొలగిపోలేదంటున్నారు. ఆయన వైసీపీలో చేరారే కానీ అధిష్టానం నుంచి మాత్రం ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించగానే సీనియర్‌ కావడంతో మంత్రి పదవిని ఆశించారు రామనారాయణరెడ్డి. కానీ, జగన్‌ మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పైగా జూనియర్ నేతల్ని అందలం ఎక్కించడంతో అసంతృప్తితో మరింత రగిలిపోయారు.

ఏకగ్రీవానికి సహకరిస్తారా? పోటీకి సిద్ధమవుతారా? బీజేపీకి మద్దతిస్తారా? తిరుపతి ఉపఎన్నికల్లో చంద్రబాబు వైఖరేంటి?


సొంత పార్టీపై ఆనం మాటల యుద్ధం:
నియోజకవర్గ పరిధిలో అధికారులు తాను చెప్పిన మాట వినకపోవడం, జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే క్రమంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఒక్కసారిగా ఆనంలోని ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో ఆనం అధికార పార్టీ మీద మాటల యుద్ధానికి దిగారు. తాను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనని.. తన నియోజకవర్గం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆనంకి మంచి రోజులొస్తాయంటున్న అనుచరులు:
పార్టీలో రామనారాయణరెడ్డికి బ్యాడ్ టైమ్ నడుస్తోందని అంటున్నారు. అయితే ఆయనకు మంచి రోజులు వస్తాయని, పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుందని అనుచరులు భావిస్తున్నారు. దీనికి కూడా రకరకాల కారణాలు విశ్లేషిస్తున్నారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. జగన్ పాలనకు తిరుపతి పార్లమెంట్ ఉపపోరు రెఫరెండంగా కొందరు అభివర్ణిస్తుండడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కల్యాణ చక్రవర్తి, టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య లేదా పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేర్లు తెర మీదకొచ్చాయి.

కాకానితోనూ ఆనంకి మంచి సంబంధాలు:
తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో వెంకటగిరి నియోజకవర్గం ఒకటి. ప్రస్తుతం రామనారాయణరెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండి రద్దయిన రాపూరు నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో ఆయా మండలాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ఆనంకు అనుచరగణం ఉంది. మరోవైపు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డితోనూ మంచి సంబంధాలున్నాయి.

ఉపఎన్నిక జరిగితే ఆనం అవసరం పార్టీకి ఎంతైనా ఉంది:
పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో పాటు పోల్ మేనేజ్‌మెంట్‌లో ఆనంకు మంచి అనుభవం ఉంది. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగితే ఆనం అవసరం పార్టీకి ఎంతైనా ఉందనేది అనుచరులు చెబుతున్న మాట. మరి పార్టీలో ఆనం రామనారాయణరెడ్డికి ప్రాధాన్యం దక్కుతుందా? లేదా? అనేది భవిష్యత్తే నిర్ణయించాల్సి ఉందని అంటున్నారు.

Related Tags :

Related Posts :