ఏపీలో జిల్లాల విభజన సాధ్యమేనా? జగన్ సర్కార్ వ్యూహం ఇదేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ చాలా హామీలిచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తానిచ్చిన హామీల్లో ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరో హామీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా… వాటిని పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 జిల్లాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది ప్రభుత్వం. నిజానికి జిల్లాల విభజన అనేది అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులోనూ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాను చేయడం ఇంకా కష్టంతో కూడుకున్న పని. రాజకీయంగా, సామాజికంగా, భౌగోళికంగా, పాలనాపరంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే విభజన చేయాల్సి ఉంటుంది.

జగన్‌ ఇచ్చిన హామీ మేరకు పార్లమెంటు నియోజకవర్గం ప్రకారం జిల్లాను ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బందులే ఎదురవుతాయి. ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండే పరిస్థితులుంటాయి. అలాంటప్పుడు దానిని జిల్లాగా మార్చాలంటే పాత జిల్లా నేతలు రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా అంగీకరించకపోవచ్చు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి. వాటిలో కొన్ని సెగ్మెంట్లు వేరే జిల్లాలో ఉండొచ్చు.

అప్పుడు పాతుకుపోయిన లీడర్లకు అది ఇబ్బంది. అంతేనా, ప్రజలు కూడా ఒప్పుకోకపోవచ్చు. ఉదాహరణకు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్నే తీసుకుంటే… ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉంది. అంటే జిల్లా కేంద్రానికి ఇటు పక్క ఇతర ప్రాంతాలుండవు. అటు ఇచ్ఛాపురం.. ఇటు శ్రీకాకుళం రెండూ… చివరి ప్రాంతాలే. ఇలాంటి సమస్యలు చాలానే ఉంటాయని అంటున్నారు.

జిల్లాలను ఎలా విభజిస్తే మంచిదనే.. :
ఇప్పుడిప్పుడే ఈ విషయంలో నేతలు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా శ్రీకాకుళానికి చెందిన సీనియర్‌ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు దీనిపై తొలిసారిగా మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల విభజన సాగాలని సూచించారు. దీనిపై ఎమ్మెల్యేలంతా కలసి జగన్‌తో మాట్లాడతామని అన్నారు.

ఒక విధంగా జిల్లాల విభజన తీరుపై అనుమానాలు మొదలైనట్టేనని అంటున్నారు. ఎందుకంటే భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా జిల్లాలను విభజిస్తే మంచిందనే అభిప్రాయాలున్నాయి. ధర్మాన ప్రసాదరావు బయటపడ్డారు. ఇంకా ఈ విషయంలో అలాంటి అభిప్రాయాలే ఉన్నప్పటికీ బయటకు చెప్పని నేతలు చాలా మందే ఉన్నారంటున్నారు.

ప్లాన్ ప్రకారమే జగన్ ముందకు :
జిల్లాల విభజన విషయంలో తెలంగాణలో ఎదురైన ఇబ్బందులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగితే.. కొందరు తమకు ప్రత్యేక జిల్లా కావాలంటూ రోడ్లెక్కారు. అలాంటి పరిస్థితులే భవిష్యత్తులో ఏపీలో కూడా ఎదురు కావచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

READ  పోల్ సైరన్ 2019 : AP ఓటర్లు పట్టం ఎవరికో 

మండలాలు మారితేనే ఒప్పుకోరు. అలాంటిది సొంత నియోజకవర్గం వేరే జిల్లాలోకి మారితే నేతలు ఒప్పుకొంటారా? కష్టమే. కాకపోతే ఈ విషయంలో జగన్‌కు ఫుల్‌ క్లారిటీ  ఉంది. ప్లాన్‌ ప్రకారమే ఆయన ముందుకెళ్తారని, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం కూడా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Related Posts