తన ఇద్దరు అల్లుళ్లను బాలకృష్ణ రక్షించుకుంటారా? బరిలోకి దిగుతారా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

nandamuri balakrishna: తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఏనాడు రాజకీయ వాసనలు వంటబట్టించుకోకుండా జాగ్రత్తపడ్డ బాలకృష్ణ.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాస్త చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం సినీ నటుడిగా తన వారసుడు బాలయ్య అని చెప్పారే తప్పించి రాజకీయాల్లో ఎప్పుడూ ప్రోత్సహించ లేదు. ఎన్నికల సమయంలో అప్పుడప్పుడు ప్రచారంలో పాల్గొనడం తప్పించి ఎక్కడా రాజకీయ వేదికల మీద బాలయ్య కనిపించేవారు కాదు.

ఓ క్లిష్టమైన సమస్యలో బాలయ్య:
తన బావ చంద్రబాబు సీఎం అయినా ఎప్పుడూ పవర్‌ని అడ్డుపెట్టుకొని వ్యవహారాలు చేయలేదు. అలాంటిది ఉన్నట్టుండి విభజన రాజకీయాల నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్స్ అయి తన తండ్రిని ఆదరించిన నియోజకవర్గమైన హిందూపురం నుంచి 2014లో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తానే స్వయంగా అందరు మంత్రులు, అధికారుల దగ్గరికి తిరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ఓ క్లిష్టమైన సమస్యలో ఉన్నారని అంటున్నారు. తన ఇద్దరు అల్లుళ్లను రక్షించుకోవలసిన బాధ్యత ఆయనపై పడిందని చెబుతున్నారు.

బాలకృష్ణ జోలికి వెళ్లని జగన్:
2019 ఎన్నికల్లో రాయలసీమ మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుపోతే హిందూపురం ప్రజలు బాలకృష్ణని గెలిపించారు. రాయలసీమలో టీడీపీ మూడు స్థానాలు మాత్రమే గెలిచింది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. ప్రస్తుతం హిందూపురానికి మెడికల్ కాలేజీ కావాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు బాలయ్య. 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఏనాడూ రాజకీయ విమర్శలు పెద్దగా చేయలేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న జగన్ సర్కారు కూడా ఇంతవరకూ బాలకృష్ణ జోలికి వెళ్లలేదంటున్నారు.

అల్లుళ్లకు అండగా నిలవాల్సిన సమయం వచ్చింది:
అలాంటిది ఇప్పుడు బాలకృష్ణకు ఒక చిక్కు వచ్చి పడిందని చెబుతున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆ పార్టీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతోపాటు తన ఇద్దరి అల్లుళ్లను అధికార పార్టీ టార్గెట్ చేసింది. ఒక అల్లుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అయితే మరొకరు గీతం డీమ్డ్ యూనివర్సిటీ చైర్మన్ భరత్. వీరిద్దరికీ అండగా నిలబడే బాధ్యత నందమూరి బాలకృష్ణపై పడిందని అంటున్నారు. దీంతోపాటు పార్టీకి కూడా అండగా నిలబడాలని ఆయన సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడిన బాలయ్యకు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు.

లోకేష్ ను టార్గెట్ చేసిన జగన్:
తన పెద్ద అల్లుడు లోకేశ్‌ అధికార పార్టీకి పూర్తి స్థాయి టార్గెట్‌లో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆయనపై అనేకసార్లు అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. వీటికి సంబంధించి అనేక విచారణ కమిటీలు వేశారు. రాజధాని విషయం కావచ్చు, ఫైబర్ నెట్ విషయం కావచ్చు.. ఇంకా ఇతర అంశాల్లో లోకేశ్‌ పాత్రకు సంబంధించిన ఆధారాలున్నాయంటూ అధికార పార్టీ హడావుడి చేసింది. ఇప్పటికీ లోకేశ్‌ను టార్గెట్ చేసుకుంటూ రోజూ మంత్రుల దగ్గర నుంచి అధికార పార్టీ నేతలంతా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

బాలకృష్ణ చిన్నల్లుడికి చెందిన యూనివర్సిటీపై కన్ను:
ఇక, నిన్నగాక మొన్న బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ కొన్ని కట్టడాలు విశాఖలో కూలగొట్టారు. దీనిపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగుతోంది. భరత్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతోందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ఆ పార్టీ నేతలు.

జగన్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయని బాలయ్య:
అమరావతి ప్రాంతంలో టీడీపీ హయాంలో భరత్‌కి చెందిన కంపెనీకి కేటాయించిన భూములను జగన్ సర్కార్ రద్దు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి చెందిన అనేకమంది నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మాజీ మంత్రులు సైతం జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రభుత్వంపై బాలకృష్ణ పెద్దగా విమర్శలు చేసింది లేదు.

త్వరలో రాజకీయాలకు పూర్తి సమయం కేటాయింపు:
ఈ మధ్యనే బాలకృష్ణకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వం లభించింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి సైలెంట్‌గా ఉండకుండా పార్టీకి, అల్లుళ్లకు అండగా నిలబడాల్సిందేనని ఆయన సన్నిహితులు సూచిస్తున్నట్లు టాక్‌. బాలయ్య సైతం దీనికి ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా ఆయన బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేస్తున్నారు. అది త్వరగా ముగించుకొని, ఆ తర్వాత పూర్తి సమయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేటాయిస్తారని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు. టీడీపీలో అంతర్గతంగా ఉన్న లోకేశ్‌ వ్యతిరేకులకు చెక్ పెట్టేందుకు కూడా బాలయ్య సమాయత్తమవుతున్నట్టు టాక్. మరి బాలయ్య పూర్తి స్థాయిలో పార్టీకి అండగా నిలుస్తారో లేదో చూడాల్సిందే.

Related Tags :

Related Posts :