లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో చిన్న బ్రేక్

Published

on

Will TPCC chief delay damage the party in Nagarjuna Sagar bypoll ? : తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్‌ తెరదించింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిని తాత్కాలికంగా వాయిదా వేసింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు అభ్యర్థినీ ఖరారు చేసింది. సాగర్‌పై పట్టున్న జానారెడ్డినే పోటీ చేస్తారని ప్రకటించింది.

త్వరలోనే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. సాగర్‌ సీటును నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు రూపొందిస్తుండగా…. బీజేపీ పాగా వేసేందుకు ఎత్తుగడలు పన్నుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా నాగార్జునసాగర్‌ సీటును మరోసారి దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా… అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించేసింది.

నాగార్జునసాగర్‌లో పట్టున్న జానారెడ్డినే అభ్యర్థిగా డిక్లేర్‌ చేసింది. సాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున సీనియర్‌నేత జానారెడ్డి పోటీ చేస్తారని… రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ప్రకటించారు. ఇందుకు జానారెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.

ఇక రెండు నెలలుగా కాంగ్రెస్‌ నేతలను ఉత్కంఠకు గురిచేసిన కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికతోపాటు… ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని మాణిక్కం ఠాగూర్‌ వెల్లడించారు. అప్పటి వరకు ప్రస్తుత పీసీసీనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కొనసాగుతారని ఆయన తెలిపారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక జరిగే వరకు పీసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నిక వాయిదా వేయాలంటూ జానారెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌ను కోరారు. ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తే పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తుతాయని.. అందుకే రెండు నెలలు వాయిదా వేయాలని కోరారు. అధిష్టానం కూడా జానారెడ్డి సూచనను పరిగణలోకి తీసుకుంది.

మాణిక్కం ఠాగూర్‌ కీలక నేతలతో సంప్రదింపులు జరిపారు. వారు కూడా జానారెడ్డి సూచనతో ఏకీభవించారు. దీంతో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. సమిష్టిగా పనిచేసి సాగర్‌లో జానారెడ్డిని గెలిపించాలని పార్టీ నేతలను మాణిక్కం ఠాగూర్‌ ఆదేశించారు.