Home » ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్… ప్రారంభానికి సిద్ధం
Published
4 months agoon
సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన రహదారి సొరంగమార్గం నిర్మాణం పూర్తి అయింది. ఈ టన్నెల్ కు భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ, లడఖ్ లోని లేహ్‌ను అనుసంధానించే ఈ టన్నెల్.. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనదని అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ … ఈ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు.
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్… సుమారు రూ.4 వేల కోట్లు వెచ్చించి.. గుర్రపుడెక్క ఆకారంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. ఇందుకోసం అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను అనుసరించారు. సొరంగంలో గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. లదాఖ్‌లో మోహరించిన భారత సైనికులకు ఈ టన్నెల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. టన్నెల్ కేవలం సంవత్సరంలో ఐదు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా తెలిపారు.
2010 జూన్ 28న ఈ టన్నెల్‌కు శంకుస్థాపన చేశారు. మొదట ఆరు సంవత్సరాల్లో పూర్తి చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. టన్నెల్ పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందని అధికారులు తెలిపారు. టన్నెల్ లోపల ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా, ప్రతి 500 మీటర్లకు అత్యవసర నిష్క్రమణ మార్గం(ఎమర్జెన్సీ ఎగ్జిట్) ఉంటుందని చెప్పారు.
సొరంగంలో అగ్ని ప్రమాదం జరిగినా ఎదుర్కొనేందుకు లోపల ఫైర్ హైడ్రెంట్లను కూడా ఏర్పాటు చేశారు. సొరంగం వెడెల్పు 10.5 మీటర్లు ఉండగా.. రెండువైపులా మీటర్ ఫుట్‌పాత్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సొరంగం మనాలి- లేహ్ మధ్య దూరాన్ని 46 కిలోమీటర్ల మేర తగ్గడంతో పాటు నాలుగు గంటలు సమయం ఆదా అవుతుందని అధికారులు వివరించారు
.