కరోనాకు చిక్కుతున్నవాళ్లలో యువత, మొత్తం కేసుల్లో మగాళ్లే ఎక్కువ. కారణం ఇదే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బారిన పడ్డ వారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో యువత, పురుషులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా చూసుకోవాలంటున్నారు అధికారులు.

21-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 47.1 శాతం మంది పాజిటివ్ లు:
రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడుతున్న వారిలో యువత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా 21-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 47.1 శాతం మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారు. వైద్యఆరోగ్యశాఖ మంగళవారం(జూలై 28,2020) విడుదల చేసిన కరోనా నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో(57,142) పురుషులు (65.6 శాతం)లు అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల్లో(480) కేవలం కొవిడ్‌ కారణంగానే మృతిచెందినవారు 46.13 శాతంగా, కరోనాతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు 53.87 శాతంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.


ఎక్కువగా యువత కరోనా బారిన పడటానికి కారణమిదే:
లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ కారణాలతో యువత ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నట్లుగా వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘పాఠశాలలు, కళాశాలలు తెరవని కారణంగా 20ఏళ్లలోపు వారు ఇంట్లోనే ఉంటున్నారు. 61 ఏళ్ల పైబడినవారిలో రాకపోకలు కొనసాగించేవారు తక్కువ. ఈ కారణంగా బయట తిరగడానికి అవకాశమున్న 21-60 మధ్య వయస్కుల వారు వైరస్‌ బారిన పడుతున్నారు. వారి ద్వారానే అటు పిల్లలకూ, ఇటు వృద్ధులకు వైరస్‌ వ్యాప్తి చెందుతోంది’ అని వెల్లడించాయి. తప్పనిసరిగా బయటకు వెళ్లేవారు మాస్కులు విధిగా ధరించాలని, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నాయి.

33 జిల్లాలకూ పాకింది:
రాష్ట్రంలో సోమవారం (జూలై 27) కొత్తగా 1610 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 57వేల 142కు పెరిగినట్లు వైద్యఆరోగ్యశాఖ మంగళవారం(జూలై 28,2020) నివేదిక(బులిటెన్‌)లో వెల్లడించింది. తాజా ఫలితాల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలోనే 531 ఉన్నాయి. 20కిపైగా నమోదైన జిల్లాల జాబితాలో జయశంకర్‌ భూపాలపల్లి(20), జోగులాంబ గద్వాల(34), కరీంనగర్‌(48), ఖమ్మం(26), మహబూబ్‌నగర్‌(23), మేడ్చల్‌ మల్కాజిగిరి(113), ములుగు(32), నల్గొండ(26), నిజామాబాద్‌(58), పెద్దపల్లి(48), రంగారెడ్డి(172), సంగారెడ్డి(74), సూర్యాపేట(35), వరంగల్‌ గ్రామీణ(25), వరంగల్‌ పట్టణం (152) జిల్లాలున్నాయి. వీటితో సహా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ పాజిటివ్‌లు నిర్ధారణయ్యాయి. ‘‘సోమవారం మరో 803 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 42వేల 909కి చేరుకుంది. కోలుకున్న వారి జాతీయ సగటు 64 శాతం. తెలంగాణలో అది 75.1 శాతంగా ఉంది’ అని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి బారినపడి మరో 9 మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 480కి పెరిగినట్టు తెలిపింది.ప్రైవేటులో 1,465 పడకలు ఖాళీ:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 8వేల 446 బెడ్లకు గాను 2వేల 242లో రోగులకు సేవలందిస్తుండగా, మరో 6వేల 204 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనివి కూడా కలిపి మొత్తంగా 14వేల 839 అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ పడకల సమాచారాన్ని కూడా ప్రభుత్వం తొలిసారిగా విడుదల చేసింది. రాష్ట్రంలోని 55 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలు అందుబాటులో ఉండగా, వీటిల్లో 4వేల 497 బెడ్లు ఉన్నాయి. సోమవారం నాటికి వాటిలో 3వేల 032 మంది రోగులు చికిత్స పొందుతుండగా 1,465 ఖాళీగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఇందులో ఆక్సిజన్ సదుపాయం ఉన్నవి 466, వెంటిలేటర్‌ (ఐసీయూ)ఉన్నవి 339, మిగిలినవి సాధారణ బెడ్లని తెలిపింది. కాగా, ప్రైవేటు బెడ్ల సమాచారాన్ని వెల్లడించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి ప్రభుత్వమే పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త రోగులు చేరే క్రమంలో ఈ సమాచారం ఎప్పటికప్పుడు మారుతుంటుందని, ఆ కారణంతోనూ ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా బెడ్ల కొరత సృష్టించే అవకాశాలున్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.


Related Tags :

Related Posts :