రసవత్తరంగా ఉండి యుద్ధం, ఐదుగురు రాజుల్లో ఎవరిదో ఆధిపత్యం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

undi: ఆ నియోజకవర్గంలో వర్గపోరు పీక్‌కు చేరింది. అక్కడ.. అధికార పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడంతో.. అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. అధికారులు, ప్రజలు, ఈ నాయకులకు ప్రాధాన్యత ఇస్తుండటంతో.. తాము చెప్పిందే జరగాలనే ధోరణితో.. లీడర్లంతా.. ఎవరికి వారే తామే ముఖ్యనేతలమని ప్రచారం చేసుకుంటున్నారట. ఆ ప్రచారమే.. నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు భగ్గుమనేలా చేసింది. బయటకు చెప్పకపోయినా.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పంచాయతీ మంత్రుల దగ్గరకు చేరినా ఫలితం లేదట. అందుకే.. సీఎం దగ్గరే తేల్చుకునేందురు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అనధికార ఎమ్మెల్యేల అవతారం ఎత్తిన వైసీపీ నాయకులు:
పశ్చిమ గోదావరి జిల్లాలోని.. ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో.. వైసీపీ ఫ్యాన్ హవా ఎంత వీచినా.. ఇక్కడ మాత్రం సైకిలే గెలిచింది. లోకల్ ఎమ్మెల్యే టీడీపీ వ్యక్తి అయినప్పటికీ.. ఇప్పుడు వైసీపీ నాయకులంతా.. అనధికార ఎమ్మెల్యేల అవతారం ఎత్తేశారు. నియోజకవర్గంలో.. తమ మాటే వినాలంటూ ప్రజలకు, అధికారులకు హుకుం జారీ చేసి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇదే.. ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలకు కారణమైంది.

ఉద్యోగాలు పోతాయని అధికారులకు వార్నింగ్:
ఉండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన PVL నరసింహారాజు.. నియోజకవర్గం ఇంచార్జ్ కావడంతో.. ఇప్పుడాయనే ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి.. ఏ అధికారిక కార్యక్రమం జరిగినా.. తనకు చెప్పే చేయాలంటున్నారట. తనకు తెలియకుండా ఏదైనా జరిగితే.. అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకుంటారని బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కూడా తన కేడర్‌ని కాపాడుకునేందుకు.. నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమం తన ఆధీనంలోనే జరగాలంటూ.. అధికారులకు ఆదేశాలిచ్చేశారట.

గోకరాజు, శ్రీరంగనాథరాజు కూడా ఉండిలోనే పవర్ చూపిస్తున్నారు:
ఇదిలా ఉంటే.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. తన వారసులను వైసీపీలో జాయిన్ చేసి తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్న గోకరాజు గంగరాజు కూడా తన రాజకీయ వారసులకు ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయడానికి.. ఉండి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారట. అక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో.. తన వారసులను ముందుకు నడిపిస్తున్నారు. ఇక మంత్రి శ్రీరంగనాథరాజు స్వగ్రామం ఉండి నియోజకవర్గంలోనే ఉండటంతో.. ఆయన కూడా తన పవర్ ఇక్కడే చూపించాలని భావిస్తున్నారట. అందుకే.. ఎవ్వరికీ చెప్పకుండా తన అనుచరులతో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్లిపోతున్నారనే టాక్ కూడా ఉంది. మరోపక్క.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ తరఫున గెలిచి.. సొంతపార్టీపైనే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో.. తన అనుచరగణాన్ని ఉండి నియోజకవర్గంలో మోహరించి మానిటరింగ్ చేస్తున్నారు.

నియోజకవర్గంలో నెలకొన్న అయోమయ పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్న కార్యకర్తలు:
నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేని పక్కనబెట్టి.. అధికారం లేని వైసీపీ నాయకులు, మంత్రి, ఎంపీ అంతా అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో.. నియోజకవర్గంలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. ఈ పంచాయతీ.. జిల్లా మంత్రులైన పేర్ని నాని, ఆళ్ల నాని దగ్గరకు చేరినా.. అంతా బలమైన నాయకులే కావడంతో ఏమీ చేయలేకపోయారు. దీంతో.. అక్రమంగా చెరువులు తవ్విస్తున్నారని, కోడిపందాలు, పేకాట ఆడిస్తున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న అయోమయ పరిస్థితిని పార్టీ అధిష్టానం చక్కదిద్దాలని.. కిందిస్థాయి కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Related Tags :

Related Posts :