ప్రకాశం వైసీపీలో ఆధిపత్య పోరు.. ఇన్‌ఛార్జీ సీటుకు ఎసరు తెస్తుందా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీలో నేతల మధ్య వైరం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయడం ఆ పార్టీ అధిష్టానానికి తలకు మించిన భారమవుతోందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. వైసీపీలో ఆది నుంచి ఉన్న నేతలకు.. కొత్తగా వచ్చిన నేతలకు పొసగడం లేదంట. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు దిగ్గజ నేతల మధ్య విభేదాలను తీర్చలేక.. వారిలో ఒకరిని మరో నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా పంపించే ప్రయత్నం చేస్తోందట అధిష్టానం. ఈ పరిణామం అక్కడున్న వైసీపీ ఇన్‌చార్జి సీటుకు ఎసరు తెస్తుందనే ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరి చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కరణం బలరాం తదనంతర పరిణామాల్లో వైసీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీలో చీరాలలో ఇద్దరు దిగ్గజ నేతల మధ్య పొసగడం లేదంట. వీరి ఆధిపత్య పోరుతో పార్టీలో ఇబ్బందులు ఎక్కువైపోయాయట. ఆధిపత్య పోరును తీర్చేందుకు అధిష్టానం ఒక ప్లాన్‌ వేసిందంటున్నారు. ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచిలకు న్యాయం చేయడానికి నిర్ణయించుకుందంట.

మంత్రి బాలినేని, పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా చర్చించి నాలుగు రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే ఆమంచిని పర్చూర్ వైసీపీ ఇన్ చార్జిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. ఆయన మాత్రం తనకంటే ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అయితే పర్చూర్ ఇన్‌చార్జిగా బెటర్ అని.. ఆయన సామాజికవర్గం పర్చూరులో మెజార్టీ స్థాయిలో ఉందని అందుకే ఆయన మారితేనే బెటర్ అని సూచించినట్టు సమాచారం. చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కరణం వేరే నియోజకవర్గానికి ఇన్‌చార్జి బాధ్యతలు చేపడితే తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు.

ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ మరోదానికి ఇన్‌చార్జిగా ఉండడం అసాధ్యమని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చూద్దామంటూ కరణం కూడా దాటవేశారంట. కరణం, ఆమంచిల ఆధిపత్య పోరు వల్ల చివరకు పర్చూరు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామనాథం బాబు సీటుకు ఎసరు వస్తుందనే ప్రచారం వైసీపీలో సాగుతోంది. వీరిద్దరి ఆటలో రామనాథం అరటిపండుగా మారబోతున్నారని కార్యకర్తలు గుసగుసలు ఆడుకుంటున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

Related Posts