మార్పు మంచిదే.. ఆ మంత్రి ఇంటికి క్యూ కట్టిన వైసీపీ నేతలు, కేడర్ ఫుల్ హ్యాపీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mekapati Goutham Reddy: గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ పార్టీకి తిరుగులేదనేలా కనిపించింది. కానీ, జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఆ పార్టీలోని మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు వర్గపోరు కూడా పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే వర్గ పోరుతో జిల్లాలో వైసీపీకి కొంత డ్యామేజ్ అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పార్టీ పరిస్థితి, వర్గపోరు వంటి విషయాలన్నీ అధినేత జగన్ దృష్టికి కూడా వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో ఆయన జిల్లా రాజకీయాలపై దృష్టి సారించారని చెబుతున్నారు.

సీఎం జగన్ ఆదేశాలతో ఒక్కటయ్యారు:
నాయకులంతా విభేదాలను పక్కనపెట్టి ఏకం కావాలని జగన్‌ ఆదేశించారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు పార్టీలో రాజకీయ లెక్కలు మారిపోతున్నాయట. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా కనిపించిన నాయకులు ఇప్పుడు ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. లోలోపల ఎలా ఉన్నా.. బయటకు అయితే ఆప్యాయంగా పలకరించుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ భవిష్యత్తు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంటికి జిల్లాలోని నాయకులంతా క్యూ కడుతున్నారట.

మంత్రి ఇంటికి క్యూ కట్టిన నాయకులు:
మొన్నటి వరకూ మంత్రి మేకపాటి ఇంటికి ఒక్క సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తప్ప మిగతా వాళ్లెవరూ పెద్దగా వెళ్లేవారు కాదు. మేకపాటి మాత్రం మంత్రి అయిన తర్వాత కొందరు ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వచ్చారు. ఇప్పుడు సడన్‌గా ఏం జరిగిందో కానీ.. నేతలంతా ఒక్కటవ్వడం మొదలు పెట్టడంతో కేడర్‌ ఫుల్‌ హ్యాపీ అయిపోతోంది. వారం క్రితం జిల్లాలో మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో రెండు రోజుల వ్యవధిలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యలు వరుసగా మంత్రి మేకపాటిని కలుసుకున్నారు.

మంత్రి ఇంటికి వారంతా రావడం ఇదే తొలిసారి:
సంజీవయ్య మాత్రం మేకపాటి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన మంత్రిని కలవడంలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా మిగిలిన వారంతా క్యూ కట్టడంతో చర్చనీయాంశం అయ్యింది. అది కూడా మంత్రిగా మేకపాటి బాధ్యతలు చేపట్టాక ఆయన ఇంటికి వారంతా రావడం ఇదే తొలిసారి. ప్రతిపక్షాలు మాత్రం వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తున్నాయట. అందరూ కలిసి ముందుకు సాగడటం అధికార పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోందని అంటున్నారు.

READ  పంట కాల్వలో దూసుకెళ్లిన కారు....ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి

జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత మేకపాటికి:
జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను మేకపాటికి జగన్‌ అప్పగించారని చెబుతున్నారు. అందుకే ఆయనను కలిసేందుకు నేతలంతా క్యూ కడుతున్నారని జిల్లా పార్టీ కేడర్‌లో టాక్‌. ఇటీవల మేకపాటి బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖలపై సమీక్షల సందర్భంగా కూడా జిల్లాలో పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని జగన్‌ పదేపదే సూచించాని అంటున్నారు.

ఏకంగా సీఎం జగనే ఒకటికి రెండుసార్లు చెప్పడంతో మంత్రి మేకపాటి ఆ దిశగా అడుగులేస్తున్నారని, అందులో భాగంగానే జిల్లా పార్టీ నేతలంతా వరుసగా ఆయన నివాసానికి వెళ్లి మరీ కలుస్తున్నారని చెబుతున్నారు. విభేదాలను రూపుమాపితే పార్టీ భవిష్యత్‌ మరింత బావుంటుందనే ఉద్దేశంతో అలెర్ట్‌ అయి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

Related Posts