చంద్రబాబు, లోకేష్‌ను ఇరుకున పెట్టేందుకు వైసీపీ ఎంపీల వ్యూహం… ఈసారి పార్లమెంటులో సీబీఐ కోసం పట్టుబడతారట

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ను టార్గెట్‌ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్‌ వేదికగా గళం విప్పాలని డిసైడ్‌ అయ్యారని చెబుతున్నారు. సీఆర్డీఏ అక్రమాలు, ఫైబర్ నెట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని సిద్ధమయ్యారు.

సీఆర్డీఏ అక్రమాలు, ఫైబర్ నెట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం:
సీఆర్‌డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని, రికార్డులు కూడా తారుమారు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌లో కూడా అవినీతి జరిగిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ రెండింటిపై సీబీఐ దర్యాప్తు కోరాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారని అంటున్నారు. గతంలోనే ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు కోరినా.. కేంద్ర ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం పట్ల వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో దీనిపై గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు.

అవినీతి వెనుక చంద్రబాబు, ఆయన సన్నిహితులు:
సీఆర్డీఏ, ఏపీ ఫైబర్‌నెట్‌‌లో జరిగిన అవినీతి సాధారణ కుంభకోణాలు కావని, వాటి వెనక చంద్రబాబుకు సన్నిహితులైన వారు చాలామంది ఉన్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో నారా లోకేశ్‌ ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ అనినీతిలో ఆయన హస్తముందన్నది వైసీపీ నేతల ఆరోపణ. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిగితే పెద్దల హస్తం బయటపడుతుందని, అన్ని నిజాలు వెలికివస్తాయని అంటున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తమ వ్యూహాలకు ఇప్పటికే పదును పెట్టింది వైసీపీ. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లుగా రాజధాని, ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని వైసీపీ ఎంపీలు గట్టి పట్టే పట్టబోతున్నారట.

వైసీపీ ఎత్తులను చిత్తు చేసేందుకు టీడీపీ ఎంపీల ప్లాన్‌:
వైసీపీ ఎత్తులను చిత్తు చేసేందుకు టీడీపీ ఎంపీలు కూడా ప్లాన్‌ వేసుకున్నారట. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శితో ఎంపీలు సమావేశమయ్యారు. ఏపీ మూడు రాజధానుల అంశంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై వివరణ కోరారు. రాజధాని ఎంపికపై కేంద్రం జోక్యం ఉండదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సభలో గళం విప్పేందుకు టీడీపీ ఎంపీలు నిర్ణయించారట.

ఎవరికి వారు పోటాపోటీగా వ్యూహాలు:
విభజన చట్టం హామీలను ప్రస్తావిస్తూ.. అమరావతి శంకుస్థాపనకు మోడీ వచ్చిన విషయాన్ని సభలో గుర్తు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అధికారం మారిన ప్రతిసారి రాజధానులను మార్చుతూ పోతే ప్రజాధనం వృథా కావడంతో పాటు రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందన్న వాదనను బలంగా వినిపించాలని డిసైడ్‌ అయ్యారని చెబుతున్నారు. ఇలా టీడీపీ అవినీతిపై వైసీపీ, 3 రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ.. ఎవరికి వారు పోటాపోటీగా వ్యూహాలు సిద్ధం చేయడంతో ఈ సమావేశాలపై ఆసక్తి నెలకొంది.


Related Posts