చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారు, వైసీపీ నేతల తీవ్ర ఆవేదన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ysrcp: ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్‌ కొనసాగుతోంది. అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటించిన దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజీనామాలు చేసిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామని చెప్పినా.. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే నలుగురు ఈ ఫ్యాన్‌ గాలిలో సేదదీరుతున్నారు.

ఇక మరో ఎమ్మెల్యే ముహూర్తం ఖరారు చేసుకుని రెడీగా ఉన్నారు. వచ్చిన వాళ్లు సాంకేతికంగా వైసీపీలో చేరకపోయినా చేరినట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో వీరి వ్యవహారంపై అధికార పార్టీ నేతలు కొందరు, ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల నేతలు లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలతో తీరుతో ఫీలవుతున్న వైసీపీ ఇన్‌చార్జులు, నేతలు:
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మొదలై.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ వరకూ కొనసాగుతోంది. ఇప్పుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా రెడీగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలెవరూ వైసీపీలో అధికారికంగా చేరలేదు. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా జిల్లా, నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలు బాగా ఫీలవుతున్నారని చెబుతున్నారు.

టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది:
ఒకప్పుడు ఏ తప్పు టీడీపీ చేసిందంటూ ధర్నాలు, ఆందోనలు చేశామో ఇప్పుడు అదే తప్పు మనం చేస్తున్నామంటూ చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీలో చేరకపోతే ఏంటి? పార్టీ బాధ్యతలు వారికే ఇస్తూ.. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తమని పక్కన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తమని ఇబ్బంది పెట్టిన వారు మళ్లీ ఇప్పుడు తమ నెత్తిన ఎక్కి కూర్చుంటున్నారంటూ గుర్రుమంటున్నారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించబోమని చెప్పిన సీఎం జగన్ ఇలా టీడీపీ ఎమ్మెల్యేలను తమ నెత్తి మీద పెట్టడం ఏంటంటూ లోలోపల మదనపడిపోతున్నారు. పార్టీ పెద్దలను ప్రశ్నించ లేక.. చేసేదేమీ లేక సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఈ అసంతృప్తిని పార్టీ ఎలా చల్లార్చుతుందో చూడాల్సిందే.Related Tags :

Related Posts :