Gold Rate: కొద్దిరోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర త్వరలో తగ్గబోతుంది. వచ్చే రెండు నెలల్లో డాలర్లపరంగా బంగారం ధర 12 నుంచి 15శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంచనా. క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ తన నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.99,170 వద్ద కొనసాగుతుంది. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ.90,900 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం ఔన్స్ (31.10గ్రాములు) మేలిమి బంగారం ధర 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో నమోదైన 3,500 డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం 150 డాలర్లు తగ్గింది.
వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు తగ్గుతాయని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో పేర్కొంది. గోల్డ్ రేటు ఎందుకు తగ్గుతుందనే కారణాలను కూడా వెల్లడించింది. ప్రధాన కరెన్సీలతో పుంజుకుంటున్న డాలర్ మారకం రేటు, అమెరికా – చైనా సుంకాల యుద్ధం ముగుస్తుందనే అంచనాలు. కొనసాగుతున్న లాభాల స్వీకరణ అమ్మకాలు.. వంటి కారణాల వల్ల గోల్డ్ రేటు మరో రెండు నెలల్లో ప్రస్తుతం ఉన్న ధరల్లో 12 నుంచి 15శాతం తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది.
అయితే, మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం బంగారం ఇప్పటికీ ఆకర్షణీయంగానే కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్య, దీర్ఘకాలిక లాభాల కోసం చూసే మదుపరులు తమ పెట్టుబడుల్లో ఎంతోకొంత పసిడిలో మదుపు చేయడం మంచిదని సూచించింది.