Site icon 10TV Telugu

Milk Products In Winter : చలికాలంలో పిల్లలు పాలు, పాలపదార్ధాలకు దూరంగా ఉండటమే మంచిదా?

Is it better for children to stay away from milk and milk products in winter?

Various fresh dairy products on wooden background

Milk Products In Winter : చలికాలం వచ్చిందంటే వైరస్ తో కూడిన జబ్బులు వేగంగా వ్యాప్తి చెందటం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా జలుబు ఈ సీజన్‌ ప్రారంభంతోనే మొదలవుతుంది. ప్రధానంగా చిన్నపిల్లలను జలుబు, దగ్గు, గొంతు నొప్పి బాధిస్తుంటాయి. పెద్దవారితో పోలిస్తే చిన్నారుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. వైరస్‌లు వారిపై త్వరగా దాడి చేస్తాయి. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు పిల్లల రోగనిరోధక వ్యవస్థను పెంచడంపై దృష్టిపెట్టాలి. పిల్లల్లో ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌ ఉన్నప్పుడే వ్యాధులు వారి దరిచేరకుండా నిరోధించవచ్చు. అనుకోని సందర్భంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుని త్వరగా బయటపడే శక్తి చిన్నారుల్లో ఉంటుంది.

ముఖ్యంగా చలికాలంలో శీతాకాలంలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, కొన్ని పదార్థాలకు వారిని దూరంగా ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. పిల్లలకు దూరంగా ఉంచాల్సిన ఆహారాల జాబితాలో పాలు, పాల పదార్దాలు కూడా ఉన్నాయి. ఆశ్ఛర్యంగా అనిపించినా ఇది నిజమే. ఎందుకంటే ఉదయం లేవగానే ఇంట్లోని చిన్నారులకు పాలు తాగించటం తల్లిదండ్రులకు అలవాటు. పాలతోపాటు చిన్నారులు అనే పాల ఉత్పత్తులైన వెన్న, జున్ను, క్రీమ్‌.. వంటి పాల పదార్థాలు కూడా పిల్లలు ఇష్టంగా తింటుంటారు.

అయితే శీతాకాలం ఈ అలవాట్లను మాన్పించటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే పాలు, పాల పదార్థాల్లో ఉండే జంతు సంబంధిత కొవ్వులు నోట్లోని లాలాజలం, శ్లేష్మాన్ని గట్టిపడేలా చేస్తాయి. వీటి వల్ల వారికి ఆహారం మింగటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముక్కు దిబ్బడగా ఉండటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెన్నతో తయారైన పిండి వంటల కారణంగా అధిక కొవ్వులు పోగుబడేందుకు అవకాశం ఉంటుంది. శీతాకాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల శ్వాససమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.

శీతాకాలంలో అటు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇటు శరీరానికి వెచ్చదనాన్నీ అందించే ఆహార పదార్థాలను పిల్లలకు అందించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు రోజూ జొన్నరొట్టె పెట్టడం మంచిది. విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండే ఆహార పదార్థాలను అందించాలి. జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలు, వాల్‌నట్స్‌.. వంటివన్నీ కొద్ది మొత్తాల్లో రోజువారిగా వారికి అందించాలి. స్వీట్‌లలో చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తే పిల్లల ఆరోగ్యానికి మంచి చేసిన వారమవుతాం.

 

Exit mobile version