చలికాలంలో సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. మిగతా సీజన్‌లతో పోలిస్తే శీతాకాలంలో అనారోగ్యాలు ఎక్కవగా ఉంటాయి. చలికాలంలో చాలా మందికి సహజంగా చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శీతాకాలంలో రోగనిరోధక శక్తి కూడా దెబ్బతినటం వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. చలికాలంలో ఆరోగ్యాన్నిసంరక్షించుకోవడానికి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషకాలు అందించడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం ; అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లను దూరం చేయడంలో సమర్థంగా పని చేస్తుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడటంలో అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, బరువును తగ్గించడంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి ; వెల్లుల్లిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, జింక్, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గుల నుంచి కూడా మెరుగైన రక్షణనిస్తుంది.
పసుపు ; పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో రోజువారీ ఆహారంలో పసుపును భాగం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసును వంటల్లో మాత్రమే కాకుండా పాలుతో కలిపి తీసుకోవచ్చు.
బాదం ; బాదంపప్పులో మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బాదంలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అదనంగా వైరస్‌లు, బాక్టీరియాలు కారణంగా సంభవించే ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
తులసి ఆకులు ; తులసి ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఆకులు శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తాయి. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. తులసి ఆకులను వేడినీటిలో తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకోవటం మంచిది.